Sexual harassment: రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై వరుసగా జరుగుతున్న అఘాయిత్యాలు.. కలకలం సృష్టిస్తున్నాయి. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మానసిక వికలాంగురాలిపై, రేపల్లెలో మహిళపై గ్యాంగ్ రేప్, అనకాపల్లిలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం ఇలా రోజుకో అమానవీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో ఓ చిన్నారిపై టీచర్ కీచకపర్వం బయటపడింది.
వైఎస్ఆర్ జిల్లా పులివెందులలోని ఓ పాఠశాలకు చెందిన చిన్నారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో.. ఉపాధ్యాయుడు శివశంకర్‌ను అరెస్టు చేసినట్లు.. ఎస్సై గోపీనాథరెడ్డి తెలిపారు. బ్రాహ్మణపల్లి గ్రామంలోని ఓ పాఠశాలలో.. నిందితుడు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అదే బడిలోని చదువుతున్న ఓ చిన్నారిని గత కొద్దిరోజులుగా.. ఓ తరగతి గదిలోకి తీసుకెళ్లి వేధింపులకు గురిచేస్తూ, అసభ్యంగా ప్రవర్తించేవాడని పోలీసులు తెలిపారు.
విషయాన్ని ఎవరితోనైనా చెబితే చంపుతానని బెదిరింపులకు గురి చేశాడని వివరించారు. ఈ విషయంపై దిశ యాప్‌నకు అందిన సమాచారంతో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై తెలిపారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని, న్యాయస్థానంలో హాజరుపరుస్తామన్నారు.
సింహాద్రిపురంలో.. జిల్లాలోని సింహాద్రిపురంలో మరో ఘటన చోటు చేసుకుంది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికకు సంబంధించిన అసభ్య వీడియోలు, చిత్రాలు గత కొద్దిరోజులుగా వాటప్స్ గ్రూపుల్లో ప్రచారం చేస్తుండటంపై ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్సై గోపినాథ్ రెడ్డి తెలిపారు.