Graduate MLC Elections Updates: ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి చిరంజీవిరావు విజయం దిశగా దూసుకుపోతున్నారు. ఆయనకు ఇప్పటికే 27 వేల ఓట్లకుపైగా మెజార్టీ లభించింది. మొత్తం 8రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి చిరంజీవిరావు 27వేల 317 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రులకు చెందిన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగిసింది. అభ్యర్థి విజయానికి రావాల్సిన మొదటి ప్రాధాన్యత ఓట్లు 94 వేల 509 ఓట్లు కాగా... తెలుగుదేశం అభ్యర్థి వేపాడ చిరంజీవిరావుకు 82 వేల 958 ఓట్లు లభించాయి. ఇంకా 11 వేల 551 ఓట్లు వస్తే చిరంజీవిరావు గెలిచినట్లు ప్రకటిస్తారు. తొలి ప్రాధాన్యత ఓట్ల కోటా పూర్తికాకపోవడంతో ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. తక్కువ ఓట్లు వచ్చినవారి ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను కలుపుతున్నారు.
తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 6 రౌండ్లు పూర్తయ్యేసరికి.. తెలుగుదేశం అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ భారీ అధిక్యంతో ముందంజలో ఉన్నారు. ప్రతిరౌండ్‌లోనూ ఆధిక్యత కొనసాగిస్తూ వస్తున్నారు. ఏడో రౌండ్తో మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఈ రౌండ్లో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌కు 27,262 ఓట్ల ఆధిక్యం వచ్చింది. కంచర్ల శ్రీకాంత్‌కు మెుత్తం 1,12,514 ఓట్లు రాగా.. వైసీపీ అభ్యర్థి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డికి 85,252 ఓట్లు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారులు రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపునకు సిద్ధమయ్యారు.
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ-తెలుగుదేశం మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. ప్రతిరౌండ్‌లోనూ నువ్వా-నేనా అన్నట్లు ఫలితాలు వెలువడుతున్నాయి. ఏడు రౌండ్లు పూర్తయ్యేసరికి వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రరెడ్డికి 65,136 ఓట్లు రాగా.. 1,382 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఏడు రౌండ్లలో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామ్‌గోపాల్‌రెడ్డికి 63,754 ఓట్లు నమోదయ్యాయి. పశ్చిమ రాయలసీమలో ఇప్పటివరకు 1,68,023 ఓట్లను లెక్కించారు. మూడోరౌండ్ లో 76, నాల్గో రౌండ్ లో 22, ఐదోరౌండ్ లో కేవలం 11 ఓట్లు మాత్రమే ఆధిక్యం సాధించారంటే... ఇక్కడ పోటీ ఏ విధంగా ఉందో అర్థమవుతోంది. మొదటి ప్రాధాన్య ఓట్లలో ఏ అభ్యర్థి విజయం సాధించకుంటే.. ద్వితీయ ప్రాధాన్య ఓట్లు లెక్కించనున్నారు. దీంతో పీడీఎఫ్ వామపక్షాల మద్దతుతో తాము సునాయసంగా విజయం సాధిస్తామని తెలుగుదేశం ధీమా వ్యక్తం చేస్తోంది.
ఓట్ల లెక్కింపు నిలిపివేయాలి: తనకు వచ్చిన ఓట్లన్నీ టీడీపీ ఖాతాలో వేసుకుంటున్నారని, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస రవీందర్ రెడ్డి ఆరోపించారు. తక్షణమే ఓట్ల లెక్కింపు నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరుగుతున్నాయని ఎన్నికల రాష్ట్ర పరిశీలకులకు, జిల్లా అధికారికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశానని వెల్లడించారు.
వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస రవీందర్ రెడ్డి చేసిన ఆరోపణలపై టీడీపీ మాజీ మంత్రులు కాలువ శ్రీనివాసులు, పల్లె రఘునాథ్ రెడ్డిలు తీవ్రంగా స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన వైకాపా నాయకులే ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. వైకాపా నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని తాము పలుసార్లు ఈసీకి ఫిర్యాదు చేశామని వెల్లడించారు. ఓటమి తప్పదని తెలుసుకున్న రవీందర్ రెడ్డి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఇవీ చదవండి: