Nara Lokesh Yuvagalam Padayatra: వైఎస్‌ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో 110వ రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. దారి పొడవునా ప్రజలు లోకేశ్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. మహిళలు, కార్యకర్తలు హారతులు, గజమాలలతో ఘన స్వాగతం పలుకుతున్నారు. ఈరోజు పాదయాత్రలో భాగంగా.. పెద్ద పసుపులచావిడి వద్ద గ్రామస్థులు తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ లోకేశ్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. గ్రామంలో రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ సమస్యల్ని తీర్చాలని కోరారు.
సమస్యలపై లోకేశ్‌కు వినతిపత్రం: బీసీ కాలనీలో నీటి మట్టానికి తక్కువగా ఉన్న రోడ్లను లెవల్ చేయాలనీ గ్రామస్థులు విన్నవించారు. శెనగ రైతులకు మద్దతు ధర క్వింటాల్ రూ.6వేల 500 ఇప్పించాలని కోరారు. గ్రామంలోని వీధిలైట్ల సమస్యను పరిష్కరించాలని వేడుకున్నారు. పంట కాలువల పూడికలు తీయించాలని కోరారు. గ్రామంలోని చెరువు ప్రమాదకరంగా ఉందని.. అందుకోసం చెరువు చుట్టూ రిటైనింగ్ వాల్ కట్టించాలనీ పేర్కొన్నారు. జమ్మలమడుగు నుంచి పెద్దపసుపుల మధ్య ఉన్న రోడ్డును డబుల్ రోడ్డుగా చేయాలని.. పెండింగ్‌లో ఉన్న సీసీ రోడ్లను నిర్మించాలి డిమాండ్ చేశారు. తమ గ్రామం నుంచి చిన్న పసుపుల, ఉప్పలపాడు, చిన్నశెట్టిపల్లికి లింకు రోడ్లు వేయాలనీ నారా లోకేశ్‌ను కోరారు. వారి సమస్యలపై సానుకూలంగా స్పందించిన లోకేశ్.. అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఎన్నికలకు ముందు పలు రకాల హామీలు ఇచ్చిన జగన్.. ఆ తర్వాత..!: జగన్మోహన్ రెడ్డి దివాలా ప్రభుత్వాన్ని చూసి కాంట్రాక్టర్లు పారిపోతున్నారని లోకేశ్ ఎద్దేవా చేశారు. రోడ్లపై తట్టమట్టి పోసే దిక్కులేదని.. గత నాలుగు సంవత్సరాలుగా గ్రామ పంచాయితీలను పూర్తిగా నిర్వీర్యం చేశారనీ విమర్శించారు. కొన్ని చోట్ల పరువు కోసం సొంత డబ్బుతో పనులు చేసిన సర్పంచ్‌లు.. ప్రభుత్వం నుంచి బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. టీడీపీ పాలనలో గ్రామాల్లో 25వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, 30లక్షల ఎల్ఈడీ లైట్లు వేశామన్నారు.
రైతులకు రూ.3వేల 500 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర కల్పిస్తానన్న సీఎం, ఎన్నికల తర్వాత ముఖం చాటేశారని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి రాగానే గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. సీసీ రోడ్లు, లింకు రోడ్లను నిర్మిస్తామన్నారు. పెద్ద పసుపుల గ్రామంలో చెరువుకు రిటైనింగ్ వాల్ నిర్మిస్తామన్న లోకేశ్.. రైతులు పండించే ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించి, వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం అని హామీ ఇచ్చారు. పాదయాత్రలో లోకేశ్ ప్రజలకు అభివాదం చేస్తూ.. వారితో ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ ఉత్సాహంగా ముందుకు కదులుతున్నారు.
ఇవీ చదవండి: