కడప జిల్లాలో తెదేపా కీలక నేత, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పార్టీ మారనున్నారు. ఈ క్రమంలో ఆయన భాజపాలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. బుధవారం ఆయన దిల్లీకి వెళ్లారు. నేడు జాతీయ నేతల సమక్షంలో భాజపా తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. ఎన్నికల ఫలితాల నుంచి తెదేపాకు ఆయన దూరంగా ఉంటున్నారు. కమలం పార్టీ గూటికి చేరుతారని కొన్నాళ్ల నుంచి జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో భాజపా పెద్దల నుంచి గ్రీన్‌సిగ్నల్ రావటంతో ఆయన దిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం పదిన్నర గంటలకు భాజపా ముఖ్యనేతలతో అపాయింట్మెంట్ దొరికిందని తెలిసింది. అన్నీ కుదిరితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా లేదంటే భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో భాజపా తీర్థం పుచ్చుకోనున్నారు. ఆదినారాయణ రెడ్డి గత ఎన్నికల్లో కడప లోక్‌సభ అభ్యర్థిగా తెలుగుదేశం తరఫున పోటీ చేసి, వైకాపా అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.
ఇదీ చదవండి: