TDP Btech Ravi Sensational Comments on Police: నవంబర్ 14 వ తేదిన ఉద్దేశపూర్వకంగానే పోలీసులతో కిడ్నాప్ చేయించి, సీఎం జగన్.. తనను చంపేందుకు కుట్ర చేశారని పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి ఆరోపించారు. కేవలం రాజకీయ కక్షతోనే పోలీసుల చేత ఇలాంటి దుశ్చర్యకు ఒడిగట్టారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎక్కడైనా ప్యాలెస్‌లు, భవంతులు కట్టుకోవచ్చు కానీ తమ పార్టీ కార్యకలాపాల కోసం పులివెందులలో చిన్న కార్యాలయం ప్రారంభిస్తే ఓర్చుకోలేక తనను చంపడానికి పోలీసు వ్యవస్థను ఉపయోగించారని మండిపడ్డారు.
పాయింట్ బ్లాంక్‌లో తుపాకీ పెట్టి: తనను అరెస్ట్ చేసి రెండున్నర గంటలపాటు నిర్బంధించి బెదిరించారని అన్నారు. పాయింట్ బ్లాంక్‌లో తుపాకీ ఎక్కు పెట్టి ముఖానికి ముసుగులు, చేతులకు బేడీలు వేసి వారికి కావాల్సిన సమాచారాన్ని రాబట్టేందుకు అనేక ప్రశ్నలు సంధించారని బీటెక్ రవి వెల్లడించారు. 15 రోజులు కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న బీటెక్ రవి, మూడు రోజుల కిందట బెయిలుపై విడుదలయ్యారు. అరెస్ట్ సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై ఇవాళ కడపలో మీడియా సమావేశంలో వెల్లడించారు.
బీటెక్ రవి రిమాండ్ పొడిగించిన కడప కోర్టు - పులివెందుల తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు
బతికుంటేనే కదా నువ్వు పోటీ చేసేది అంటూ: 14వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు పోలీసులు కిడ్నాప్ చేసి తనను రహస్య ప్రదేశానికి తీసుకెళ్లారని పేర్కొన్నారు. పులివెందులలో జగన్ పైన పోటీ చేసే స్థాయి ఉందా అని, బతికుంటేనే కదా నువ్వు పోటీ చేసేదని పోలీసులు బెదిరించారని పేర్కొన్నారు. వివేకా కుమార్తె సునీతను కడప ఎంపీగా పోటీ చేయించాలని నువ్వు, సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా రాయబారం నడుపుతున్నారా అనే విషయాలను పోలీసులు అడిగారని తెలిపారు.
మీడియా కారణంగానే బతికా: బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అమిత్ షాతో చర్చలు జరిపి టీడీపీ-బీజేపీ మధ్య పొత్తు కుదిర్చే పనులు చేస్తున్నారా అని కూడా ప్రశ్నించినట్లు పేర్కొన్నారు. ఆ రోజు తాను కిడ్నాప్ అయినట్లు మీడియాలో ప్రసారం కాకుండా ఉంటే తనను పోలీసులు అంత మొందించే వారని బీటెక్ రవి ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా కారణంగానే తాను బతికి బయట పడ్డానన్నారు.
బీటెక్ రవిని హతమార్చేందుకు కుట్ర పన్నిన మాట వాస్తవం కాదా ? ఎస్పీ ప్రమాణం చేయగలరా?: సీఎం రమేష్
ఎస్సీ ఉన్నా అన్నీ ఆయనే: అరెస్ట్ సందర్భంగా కడప సీఐ అశోక్ రెడ్డి దారుణంగా వ్యవహరించారని, జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ సాంకేతికంగా ఎస్పీ మాత్రమేనని బీటెక్ రవి అని విమర్శించారు. అధికారికంగా ఎస్పీ పనులన్నీ అశోక్ రెడ్డి చక్కబెడుతున్నారని ఆక్షేపించారు. ఆరోజు తన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, మీడియా ప్రతినిధులు ఎస్పీకి ఫోన్ చేసినా రెండున్నర గంటలపాటు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తనను జైలులో కలిసినపుడు చెప్పిన విషయాలనే ఆయన మీడియాకు వెల్లడించారని, ఆయన చెప్పిన మాటల్లో ఎలాంటి కల్పితాలు లేవన్నారు.
ముఖానికి ముసుగు వేసి: సీఎం రమేష్‌కు జిల్లా ఎస్పీ లీగల్ నోటీసు ఇస్తానని బెదిరిస్తున్నారని, నోటీసు ఇస్తే పోలీసు బండారం ఆధారాలతో సహా బయట పడుతుందన్నారు. ఆరోజు పోలీసు అధికారులు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎవరెవరితో మాట్లాడారనే ఫోన్ కాల్ డేటా కూడా తీసుకున్నామన్నారు. తన మొబైల్ ఫోన్ తీసుకుని డేటా తస్కరించడమే కాకుండా, ముఖానికి ముసుగు వేసి వేలిముద్రలు కూడా తీసుకున్నారని బీటెక్ రవి తెలిపారు.
బీటెక్ రవి హత్యకు పోలీసుల కుట్ర - కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టారు : ఎంపీ సీఎం రమేష్
దేనికీ భయపడే ప్రసక్తే లేదు: పోలీసులు తనను ఇబ్బంది పెట్టలేదని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ కాణిపాకంలో ప్రమాణం చేస్తే, తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని బీటెక్ రవి సవాల్ విసిరారు. పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక జగన్ మోహన్ రెడ్డి తనను అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారని బీటెక్ రవి మండిపడ్డారు. తనను అంతమొందించినా తన సోదరులు, కుటుంబ సభ్యులు గట్టిగా నిలబడతారనే విషయాలను సీఎం గుర్తుంచుకోవాలన్నారు. దేనికీ భయపడే ప్రసక్తే లేదని వచ్చే ఎన్నికల్లో పులివెందులలో టీడీపీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
'వ్యక్తిగత కక్షతోనే టీడీపీ నేతలపై అక్రమ కేసులు - వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని ఎవరు ఆపలేరు'