Nandam Venkata Subbaiah: తెదేపా నాయకుడు, న్యాయవాది నందం వెంకటసుబ్బయ్య హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ ఆయన భార్య అపరాజిత హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాదరావు.. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ఆయన బావమరిది బంగారురెడ్డి, ప్రొద్దుటూరు అప్పటి మున్సిపల్ కమిషనర్ ఎన్.రాధ, రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, సీబీఐకి నోటీసులు జారీచేశారు. విచారణను ఈనెల 27కు వాయిదా వేశారు.
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పి.వీరారెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘కడప జిల్లా సోములవారిపల్లిలో 2020 అక్టోబరు 29న వెంకటసుబ్బయ్యను రాజకీయ కక్షతో దారుణంగా హత్య చేశారు. మృతుని భార్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి, మరికొందరి పేర్లను ప్రస్తావించినా వారిపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఈ కేసు ప్రొద్దుటూరు రెండో అదనపు జిల్లా కోర్టులో విచారణలో ఉంది.
దర్యాప్తు సక్రమంగా నిర్వహించకుండానే పోలీసులు దాఖలు చేసిన అభియోగపత్రం ఆధారంగా కేసు విచారణ జరిగితే... పిటిషనర్‌కు అన్యాయం జరుగుతుంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని దర్యాప్తును సీబీఐకి అప్పగించాలి’ అని కోరారు.