కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె వద్ద రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఉక్కు కర్మాగారానికి కొత్త సమస్య వచ్చిపడింది. ఈ గ్రామంలో పురాతనమైన కన్యతీర్థం ఆలయం ఉంది. ఏపీ హైడ్రోస్టీల్స్ లిమిటెడ్ పేరిట ఈ ఆలయానికి సమీపంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయనుంది. వారం రోజుల క్రితం అధికారులు పర్యటించి, చుట్టూ ప్రహారీ నిర్మించేందుకు ఆమోదం తెలిపారు.
ఈ ప్రహారీ పరిధిలోనే కన్యతీర్థం ఆలయం ఉండటంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఆలయ చరిత్ర, భక్తుల రద్దీ, నిత్య అన్నదానం తదితర విషయాలను ప్రభుత్వం ఆలోచించి ఆలయానికి వెలుపల నుంచి ప్రహారీను ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
- ఆలయ ప్రాశస్త్యం
కన్యతీర్థం ఆలయాన్ని సప్తమాతృకా క్షేత్రమనీ, దైవ తీర్థంగా పురాణకాలం నుంచి విరాజిల్లుతోంది. పినాకిని నది ఒడ్డున సుమారు 5 వేల ఏళ్ల క్రితం ఈ క్షేత్రం వెలసినట్లు శాసనాలు చెబుతున్నాయి. ఆలయం కొలనులో దేవకన్యలు స్నానమాచరించి... త్రిపుర సుందరీ దేవి అమ్మవారిని పూజించటం వలనే ఈ క్షేత్రానికి కన్యతీర్థం అని పేరు వచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి.
- ఆర్డీవోకు వినతి
కర్మాగార ప్రహారీని ఆలయానికి బయట నుంచి ఏర్పాటు చేయాలని కోరుతూ.. కన్యతీర్థం పాలకవర్గ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శివనాథ్‌రెడ్డి, జమ్మలమడుగు ఆర్డీవో నాగన్నకు వినతిపత్రం అందజేశారు. ఆలయ ప్రాశస్త్యం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి, ప్రహారీని గుడి బయట నుంచి ఏర్పాటు చేసేలా ఆలోచించాలని కోరారు.
ఇదీ చదవండి: చిన్న వరదాయపల్లెలో నాకాబందీ