కడప జిల్లా వేముల మండలం తుమ్మలపల్లి వద్ద.... యురేనియం కర్మాగారం రెండో గని విస్తరణ పనులు జోరందుకున్నాయి. 2006లో ప్లాంటు ఏర్పాటుకు అధికారులు యత్నించగా... గ్రామస్థుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రజాభిప్రాయసేకరణలో రాళ్లదాడి, గొడవలూ జరిగాయి. అప్పటి నాయకులు నచ్చజెప్పటంతో... తుమ్మలపల్లి, కేకే కొట్టాల, మబ్బుచింతలపల్లి, రాచకుంటపల్లి, భూమయ్యగారిపల్లె గ్రామాల రైతులు పట్టా భూములు ఇచ్చారు.
1820 ఎకరాల్లో... 11 వందల ఆరు కోట్ల రూపాయల వ్యయంతో 2007లో ప్లాంటు నిర్మాణం మొదలైంది. 2013 ఏప్రిల్ 20న యురేనియం ఉత్పత్తి అధికారికంగా ప్రారంభమైంది. యురేనియం వ్యర్థాలు నిల్వ చేయటంతో... భూగర్భజలాలు కలుషితమవుతున్నాయని... వింత వ్యాధులతో సతమతమవుతున్నామని ప్రజలు, ప్రజాసంఘాలు, పర్యావరణ వేత్తలు ఉద్యమాలు చేశారు. ఎన్ని ఆందోళనలు చేసినా అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో... రెండో గని విస్తరణకు చర్యలు ఆరంభం కావటంతో.. గ్రామస్థులు ఎలా స్పందిస్తారన్నదానిపై ఆసక్తి నెలకొంది.
వచ్చే నెల 6వ తేదీన... గని విస్తరణపై ప్రజాభిప్రాయ సేకరణకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం కర్మాగారం నుంచి ఏటా 9 లక్షల టన్నుల ముడి యురేనియం వెలికి తీస్తుండగా.... దీన్ని 13 లక్షల 50 వేల టన్నులకు పెంచేందుకు గని విస్తరణ చేపడుతున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. దీని కోసం దాదాపు 420 ఎకరాలు సేకరించాలని యోచిస్తున్నారు. ఇందులో 70 శాతం భూములు రాచకుంటపల్లెకు చెందిన రైతులవే ఉన్నాయి. పూర్తిగా వ్యతిరేకించినా ప్రయోజనం ఉండదని భావిస్తున్న గ్రామస్తులు.. ఊరిలోని భూములన్నీ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
గని విస్తరణ నిర్ణయాన్ని పర్యావరణ వేత్తలు, మానవహక్కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సమస్యలు పరిష్కరించకుండా.. విస్తరణ చర్యలు చేపట్టొద్దని ఎంపీ అవినాష్‌రెడ్డికి లేఖలు రాశారు.
ఇదీ చదవండీ... 'కొవిడ్ ఉన్నప్పుడు.. ప్రజాభిప్రాయ సేకరణ ఎలా సాధ్యం'