కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. వివిధ దేశాలకు చెందిన సంస్థలు ... ఇక్కడ పరిశ్రమ ఏర్పాటుకు ఆసక్తి చూపుతూ...ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నాయి. పరిశ్రమకు అనువైన భూములు చూడాలంటూ జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. విదేశీ సంస్థ ఒకటి త్వరలో పూర్తి స్తాయిలో గానీ...ప్రభుత్వ భాగస్వామ్యంతో గానీ పరిశ్రమ ఏర్పాటు చేయనుంది. గత ప్రభుత్వం రాయలసీమ ఉక్కు కార్పొరేషన్ లిమిటెడ్ పేరిట ..మైలవరం మండలం ఎం. కంబాలదిన్నెలో పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన చేసినా అడుగు ముందుకు పడలేదు. కొత్త ప్రభుత్వం వచ్చాక సీఎం జగన్...కడప జిల్లాలో డిసెంబర్ 26న ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. అందులో భాగంగా వివిధ సంస్థలతో అధికారులు సంప్రదింపులు చేస్తున్నారు. దక్షిణకొరియాకు చెందిన హుందాయ్, పోస్కో సంస్థలతో పాటు...చైనాకు చెందిన సంస్థలు ఇప్పటికే కడప జిల్లాలో పర్యటించాయి. మౌలికవసతుల కల్పన, రైలు, రోడ్డు అనుసంధానతలపై ఆరా తీశాయి. జమ్మలమడుగు పరిధిలోని బ్రాహ్మణి స్టీల్స్ ప్రాంతాన్ని పరిశీలించాయి. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు హుందాయ్ ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో పరిశ్రమ ఏర్పాటుకు 4 నుంచి 5 వేల ఎకరాలు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. గత ప్రభుత్వం కంబాలదిన్నె వద్ద శంకుస్థాపన చేసిన భూములను కాకుండా ఇతర స్థలాలను సర్కారు పరిశీలిస్తోంది. మైలవరం, జమ్మలమడుగు మండల్లాల్లోని భూములు, కడపకు సమీపంలోని కొప్పర్తి పారిశ్రామిక వాడ భూములను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఇవీ చూడండి: