ఈ నెల 30న జరిగే కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నిక ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి కె.విజయానంద్(State Election Officer Vijayanand on Badvel ByPoll) పరిశీలించారు. బద్వేలులో కడప జిల్లా కలెక్టర్ విజయరామరాజు, రిటర్నింగ్ అధికారులు, రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించిన ఆయన... ఎన్నిక నిర్వహణపై పలు సూచనలు చేశారు. ఎన్నికలు సజావుగా జరిగేలా జిల్లా యంత్రాంగం పటిష్ఠ ఏర్పాట్లు చేసిందని ఎన్నికల ముఖ్య అధికారి విజయానంద్ చెప్పారు. ఈ నెల 30న ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. 3 వేల మంది పోలీసులతో పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన ఘటనల దృష్ట్యా ఈసారి బయటి వ్యక్తుల్ని నియోజకవర్గంలో లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎన్నికల అధికారి విజయానంద్ తెలిపారు. పోలింగ్‌కు 72 గంటల ముందు నుంచే సైలెన్స్ పీరియడ్ ఉంటుందని చెప్పారు.
స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి..
కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల సంఘం ప్రత్యేక నిబంధనలను జారీ చేసిందని..... వాటిని పక్కాగా పాటించాలని కడప జిల్లా కలెక్టర్ విజయరామరాజు రాజకీయ పార్టీలను కోరారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
ఉప ఎన్నిక బరిలో 15 మంది అభ్యర్థులు..
బద్వేలు ఉప ఎన్నిక(Badvel ByPoll)లో 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ నెల 30న ఎన్నిక జరగనుండగా.. నవంబర్ 2న ఫలితాలు వెలువడనున్నాయి. ఓటరు చైతన్యంపై అవగాహన కల్పించే పోస్టర్లను రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి విజయానంద్ ఆవిష్కరించారు.
ఇదీ చదవండి: