అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ బాషాభాయ్‌ని కడప జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైజాక్ గ్యాంగ్ వెంబడించేలా చేసి ఐదుగురు తమిళ కూలీల మరణానికి కారకుడైన బడా స్మగ్లర్‌ను …. బెంగళూరు వెళ్లిన ప్రత్యేక బృందం చాకచక్యంతో పట్టుకుంది. కర్ణాటక రాజధానిలో మకాం వేసి చిత్తూరు, కడప జిల్లాల్లో ఎర్రచందనాన్ని దేశసరిహద్దులు దాటిస్తున్న బాషాభాయ్‌ను ప్రశ్నిస్తే స్మగ్లింగ్‌కు సంబంధించిన మరిన్ని విషయాలు బయటపడే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు.
కాల్‌డేటా ఆధారంగా అరెస్ట్
ఈ సోమవారం వేకువజామున.. వల్లూరు మండలం గోటూరు వద్ద రెండు కార్లు, టిప్పర్ ఢీకొని మంటలు చెలరేగిన ప్రమాదంలో ఐదుగురు తమిళ కూలీలు సజీవదహనమయ్యారు. ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు.. స్మగ్లింగ్ వెనుక బాషాభాయ్ ఉన్నట్లు తెలిసింది. కూలీలతోపాటు వారిని వెంబడించిన హైజాక్ గ్యాంగ్‌కూ అతడే ఆదేశాలు ఇచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. కడప జిల్లాకు చెందిన హైజాక్ గ్యాంగ్‌లో ముగ్గురూ మంగళవారమే అరెస్టుకాగా బాషాభాయ్ కోసంఎస్పీ ఐదు ప్రత్యేక బృందాలను నియమించారు. బెంగళూరు వెళ్లిన పోలీసులు... కాల్‌డేటా ఆధారంగా బాషాభాయ్‌ను అరెస్టు చేసి కడపకు తరలించారు.
మరోవైపు... ప్రమాదంలో మృతి చెందిన ఐదుగురిలో నలుగురి మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించారు. చంద్రన్ అనే వ్యక్తి మృతదేహాం తీసుకెళ్లేందుకు ఎవరూ రాలేదు. సేలం జిల్లా పోలీసులతో పాటు కుటుంబసభ్యులకూ సమాచారమిచ్చామని..... కడప జిల్లా పోలీసులు తెలిపారు. మరో రెండు రోజులు వేచిచూశాక మృతదేహం ఏం చేయాలన్నదానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రిమ్స్‌లో చికిత్స పొందుతున్న మణిని.... కోలుకున్న తరువాత పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశముంది.
ఇదీ చూడండి.
పాఠశాలకూ పాకిన మహమ్మారి.. వైరస్ బారిన పడుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు