కరోనా తీవ్రరూపం దాల్చడంతో ఉపాధి అవకాశాలు కుప్పకూలి సాధారణ పౌరుల జీవనం అతలాకుతలంగా మారుతోంది. ప్రజారవాణా వ్యవస్థ నిలిచి పోవడంతో కడప జిల్లా ప్రొద్దుటూరులోని డూపియాన్ సిల్క్ ఉత్పత్తి కేంద్రం పనితీరు ఆగి ట్విస్టర్ల ఉపాధికి గండిపడింది. దీనికి సంబంధించిన ముడి పదార్థం ప్రొద్దుటూరు సిల్క్ ఎక్స్ఛేంజీ కేంద్రానికి సకాలంలో రావడం లేదు. డూపియాన్ సిల్క్ ముడిపదార్థం లభ్యం లేకపోవడంతో వాటిపై ఆధారపడి జీవించే ట్విస్టర్లకు (పురితిప్పేవారు) పని కరవైంది. సిల్క్ ఎక్స్ఛేంజీ కేంద్రంలో డూపియాన్ ఆ ముడి పదార్థాన్ని ట్విస్టర్లు కొనుగోలు చేస్తారు. ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మోరగుడి ప్రాంతాల్లో ఈ పనిపై ఆధారపడే వారు అధిక సంఖ్యలో ఉన్నారు. ప్రొద్దుటూరు పరిధిలోనే దాదాపు 500 మంది ట్విస్టర్లు ఉన్నట్లు అంచనా. డూపియాన్‌ను పురి తిప్పాలంటే మొదట చేతిరాట్నాల ద్వారా పని చేసే వారికి ఇవ్వడం జరుగుతోంది. ఆ ముడి పదార్థాన్ని పంటెలుగా వారు తయారు చేస్తారు. పురితిప్పే యంత్రంపై దాదాపు ఐదు నుంచి ఆరుగురు చేతి రాట్నాల వారు ఆధారపడుతున్నారు. ఈ రాట్నదారుడు ముడి పదార్థాన్ని పంటెలుగా మారుస్తారు. ఒక్కో రాట్నంపై పని చేసే వారికి రోజుకు కిలో ముడి పదార్థాన్ని పంటెలుగా తయారు చేసేందుకు రూ.50లను ట్విస్టర్ కూలిగా అందిస్తాడు. డూపియాన్ ముడి పదార్థం గత వారం నుంచి రోజుకు ఒకసారే వస్తోంది. మాస్టర్ వీవర్లు కొందరు ట్విస్టర్లకు డూపియాన్ సిల్క్ ముడి పదార్థాన్ని పురితిప్పే పనిని కూలికి అప్పగించడం జరుగుతోంది. కూలిపై ఆధారపడే ట్విస్టరుకు రోజులో కిలోకు రూ.125లు కూలిని ఇస్తాడు. చేతిరాట్నపుదారుడి నుంచి పంటెలుగా తయారు చేసేందుకు కిలో రూ.40 నుంచి రూ.50లు కూలిగా ట్విస్టర్ ఇస్తాడు. ట్విస్టర్లు తమకొచ్చే కూలిలో రాట్నపుదారుడికి, ట్విస్టింగ్ యంత్రం విద్యుత్ ఛార్జీలు, దారాల కొనుగోలు ఖర్చులు పోను రూ.60లు మాత్రమే మిగులుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పురితిప్పడంలో ఒక యంత్రంపై కనీసం ముగ్గురు పని చేయాల్సి వస్తోంది. ముగ్గురం కలసి పని చేయకపోతే పురిని సరి చేయలేమంటున్నారు. ముగ్గరం కలసి పని చేస్తే వచ్చే కూలినే తీసుకోవాల్సి వస్తోందన్నారు. బట్ట నేసే పనిలో తమ పాత్ర కీలకమైనా ప్రభుత్వం మాత్రం తమను చేనేత కూలిగా గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అందించే చేనేత పథకాలలో తమను అర్హులుగా గుర్తించడం లేదని, తమను గుర్తించాలని వారు వాపోతున్నారు. మాస్టర్‌వీవర్లు మాత్రం తమ బట్ట బెంగళూరు, ముంబయి, కలకత్తా లాంటి సుదూర ప్రాంతాలలో అమ్మకాలు జరగడం లేదని తమకు కరోనా సమయంలో పని ఉండడం లేదని ట్విస్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాట్నందారులకు డూపియాన్ సిల్క్ ముడి పదార్థం లేకపోవడం వల్ల వారికి ఉపాధికి కరవైంది.
చేనేత పథకాలు వర్తింపజేయాలి
ట్విస్టర్లకు చేనేత పథకాలు వర్తింపచేయాలి. బట్ట నేయడంలో మా పాత్ర కీలకమైనదని ట్విస్టర్లను ప్రభుత్వ అధికారులు చేనేతలుగా గుర్తించడం లేదు. మాకు వచ్చే కూలి, ఉపాధి తక్కువే. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆదుకోకుంటే మా పరిస్థితి అగమ్యగోచరమే. - మూర్తి, దొరసానిపల్లె
ఇదీ చూడండి.
భయమే శత్రువు.. కోలుకోవడానికి మనోస్థైర్యమే మందు