RTC employees protest in YSR district: వైయస్సార్ జిల్లాలోని ఆర్టీసీ డిపో మేనేజర్ల వేధింపులపై ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు దండెత్తారు. అధికారుల తీరు చాలా భయంకరంగా ఉందని.. ఉద్యోగుల సమస్యలను కూడా పట్టించుకునే స్థితిలో లేరని ధ్వజమెత్తారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కాకముందు కార్పొరేషన్లో ఉన్నప్పుడే.. తమ సమస్యలను పరిష్కరించే వారిని ఇప్పుడు కనీసం మా సమస్యలను ఎవరూ పట్టించు కోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్సార్ జిల్లాలోని కడప, మైదుకూరు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు డిపో మేనేజర్ల వేధింపుల నుంచి ఉద్యోగులను కాపాడాలని కోరుతూ ఎన్ఎంయూ ఆధ్వర్యంలో కడపలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి కార్యాలయం వరకు కొనసాగింది. చేతిలో ప్లకార్డ్స్ పట్టుకొని డిపో మేనేజర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చి సమస్యలను తెలియజేశారు. అనంతరం అక్కడి నుంచి కడప ఆర్టీసీ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కార్యాలయానికి వెళ్లి ఆయనకు కూడా వినతిపత్రం ఇచ్చి తమకు ఉన్న సమస్యలను తెలియజేశారు. నాలుగు డిపోలలో ఉన్న మేనేజర్లు కార్మికుల పట్ల ఉద్యోగుల పట్ల నిరంకుశ వైఖరి అవలంబిస్తున్నారని ధ్వజమెత్తారు. కనీసం సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందామని అధికారులకు విన్నవించినప్పటికీ వారు సమయం కేటాయించకపోవడం దారుణంగా ఉందని ఖండించారు. పలుమార్లు చర్చల పేరిట సమావేశాలు నిర్వహించినప్పటికీ.. ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సీనియార్టీ ప్రకారం విధులను కేటాయించడం లేదని.. కార్మిక సంఘం నాయకులకు కనీసం మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. పదోన్నతులు, బదిలీలు విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు.
నేటి ధర్నా రేపటి సమ్మెగా.. గత నాలుగు నెలల నుంచి డిపో మేనేజర్లపై వివిధ రూపాల్లో ఆందోళనలు నిరసనలు చేపట్టినప్పటికీ జిల్లా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పని పరిస్థితులలో ర్యాలీ చేపట్టాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు స్పందించి నాలుగు డిపో మేనేజర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసి కార్మిక సమస్యలపై దృష్టి సాధించాలని సూచించారు. లేదంటే నేటి ధర్నా రేపటి సమ్మె అవుతుందని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ఆరు డిపోల నుంచి ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు హాజరయ్యారు. ఆర్టీసీ చైర్మన్ మాట్లాడుతూ డిపో మేనేజర్లకు ఉద్యోగులకు మధ్య సమస్యలున్న మాట వాస్తవమని త్వరలో వాటన్నింటినీ పరిష్కరిస్తానని.. భవిష్యత్తులో ఇలాంటివి మళ్లీ జరగకుండా చూస్తామని తెలిపారు.
ఇవీ చదవండి: