RESTRICTIONS: సీఎం జగన్‌కే కాదు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచీ వారి కుటుంబానికి పులివెందుల కంచుకోట. ఓట్లు అడగకపోయినా ప్రతి ఎన్నికల్లోనూ భారీ మెజార్టీతో వారికి బ్రహ్మరథం పడుతున్నారు. కానీ ఈ నియోజకవర్గ ప్రజలపై సీఎం పర్యటన సందర్భంగా ఎన్నడూ లేనంతగా ఆంక్షలు పెట్టారు. సీఎం భేటీకి హాజరైన నేతల సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు తమ విన్నపాలు సమర్పించుకోలేని పరిస్థితి తలెత్తింది. మీడియాకూ లక్ష్మణరేఖ గీశారు. సీఎం పర్యటన కవరేజీకి పులివెందుల పర్యటనకు రావద్దని.. పాసులు జారీ చేయట్లేదని తేల్చిచెప్పారు.
* ఏటా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా జులై 8న సీఎం జగన్ ఉదయం ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్‌కు చేరుకుని తండ్రికి నివాళులర్పిస్తారు. గురువారం పులివెందులకు చేరుకున్న జగన్ పులివెందుల పురపాలక సంఘం అధికారులు, ప్రజాప్రతినిధులు, నేతలతో భేటీ అయ్యారు. అవినీతికి, ఆశ్రిత పక్షపాతానికి తావులేకుండా.. కుల, మత, వర్గ ప్రాంతాలకు అతీతంగా పారదర్శకంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలుచేయాలని ఆదేశించారు. ఆయన్ను కలవడానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలిరాగా.. అవకాశం ఇవ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. సిద్దవటంలో భూకబ్జాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేయడానికి ఓ వృద్ధురాలు వచ్చారు. స్థానికులు, ల్యాబ్ టెక్నీషియన్లు వినతులు ఇవ్వడానికి రాగా ఆర్డీవో శ్రీనివాసులు వారివద్ద ఆర్జీలు స్వీకరించారు.
* మీడియాను అనుమతించకపోవడాన్ని తెదేపా, సీపీఐ నేతలు తీవ్రంగా ఖండించారు. ఇది పత్రికా స్వేచ్ఛను హరించడమేనని తెదేపా కడప పార్లమెంటరీ నియోజకవర్గ మీడియా సమన్వయకర్త జనార్దన్ విమర్శించారు. భూకబ్జాలు వెలుగులోకి రాకుండా తొక్కిపెట్టడానికే మీడియాకు పాసులు ఇవ్వలేదని సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య విమర్శించారు. సాయంత్రం తొండూరు మండల నేతలతో ముఖ్యమంత్రి జగన్ గంటకు పైగా సమావేశమయ్యారు. ఈ మండలం నాయకులతోనే ప్రత్యేకంగా భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అడుగడుగునా ఆంక్షలే
ఎన్నడూ లేనివిధంగా పులివెందుల, వేంపల్లెలో ఉదయం నుంచే ఆంక్షలు అమలుచేశారు. పోలీసులు, వాలంటీర్లను అడుగడుగునా నియమించి బారికేడ్లు ఏర్పాటుచేశారు. ముఖ్యమంత్రి సాయంత్రం 6 గంటలకు వేంపల్లెకు చేరుకోగా.. ఉదయం నుంచి వీధులన్నీ మూసేశారు. ప్రధాన రహదారులనూ మూసేయడంతో ప్రజలు అసౌకర్యానికి లోనయ్యారు. వేంపల్లెలో వైఎస్‌ఆర్ పార్కును ప్రారంభించారు. దీనికి చుట్టూ పరదాలు ఏర్పాటుచేశారు. ఈ మాత్రం దానికి వేలమంది పోలీసుల మోహరింపు, బారికేడ్లు, ఆర్భాటాలు ఎందుకని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్.తులసిరెడ్డి ప్రశ్నించారు.
ఇడుపులపాయకు చేరుకున్న విజయమ్మ, షర్మిల
వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా శుక్రవారం ఇడుపులపాయలో నివాళులర్పించడానికి వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, వైతెపా అధ్యక్షురాలు షర్మిల కుటుంబసభ్యులతో కలిసి గురువారం సాయంత్రం ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఇడుపులపాయకు చేరుకుని బసచేశారు. సీఎం జగన్ దంపతులు ఇడుపులపాయకు చేరుకున్నారు. వీరంతా కలిసి రాత్రి భోజనం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. వైయస్‌ఆర్ జయంతి సందర్భంగా అందరూ కలిసి నివాళులర్పిస్తారా లేదా అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. గతేడాది వేర్వేరుగా కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు.
ఇవీ చదవండి: