"ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్" కార్యక్రమం ద్వారా కేంద్రం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఒక రాష్ట్ర విద్యార్థులు.... మరో రాష్ట్రానికి సంబంధించిన భాష, లిపి, సంస్కృతి, ఆచార వ్యవహారాలు వంటి సమగ్ర వివరాలు తెలుసుకోవడం దీని ఉద్దేశం. ఈ జనవరిలో మొదలైన ఈ కార్యక్రమం మార్చి వరకు సాగుతుంది. ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారుల కార్యాలయాల నుంచి... ప్రతిరోజూ నేర్పించాల్సిన పాఠ్యాంశాలను సందేశాల రూపంలో ప్రధానోపాధ్యాయులకు పంపుతారు. ప్రత్యేక భాష పరిచయ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ఉపాధ్యాయులు వాటిని విద్యార్థులకు నేర్పుతారు.
ఈ విధానంలో ఏపీకి పంజాబ్ రాష్ట్రాన్ని కేటాయించారు. ఈ జనవరి నుంచి పంజాబీ భాషను మన విద్యార్థులు నేర్చుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ విద్యాలయాల విద్యార్థులకు ఈ తరగతులను అందుబాటులోకి తీసుకొచ్చారు. పంజాబ్ రాష్ట్ర ప్రాముఖ్యత, భాష, సంస్కృతి వంటి అనేక అంశాలను ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. పంజాబీ, హిందీ భాషల్లో పదాలను రాస్తూ వాటి అర్థాలను తెలుగులో వివరిస్తున్నారు. ఆ రాష్ట్రంలోని ప్రముఖ స్థలాలు, ప్రసిద్ధ క్షేత్రాలు, భౌగోళిక అంశాలు వంటి సమగ్ర విషయాలను వివరిస్తున్నారు. పంజాబీ లిపి సులువుగా, అందరూ నేర్చుకునే విధంగా ఉందని ఆనందంగా చెబుతున్నారు విద్యార్థులు.
ఈ కార్యక్రమం ద్వారా అదనంగా ఒక భాష నేర్చుకుంటున్నామనే సంతృప్తి విద్యార్థులకు కలుగుతోందని ఉపాధ్యాయులు అంటున్నారు. వేగంగా పంజాబీ తెలుసుకుంటున్నారని చెబుతున్నారు.కచ్చితమైన ప్రణాళికతో పాటు ఒక ఉపాధ్యాయుడిని ప్రత్యేకంగా కేటాయిస్తే మెరుగైన ఫలితాలు సాధించొచ్చనంటున్నారు ఉపాధ్యాయులు.
ఇవీ చదవండి