కడప పురపాలక సంఘం నగరపాలక సంస్థగా అవతరించినప్పటి నుంచి వర్షాకాలంలో ముంపు సమస్య తీవ్రమవుతూ వస్తోంది. సమస్య పీకల దాకా వచ్చినప్పుడు హడావుడి చేసే అధికారులు, నాయకులు అనంతరం ఆ సమస్య పరిష్కారమయ్యిందా? లేదా? అన్న అంశంపై దృష్టిసారించకపోవడంపై ముంపు పరిస్థితి పునరావృతవుతోంది. ఆక్రమణల తొలగింపు పనులు మొదలుపెట్టిన అనంతరం నాయకుల ఒత్తిడి మేరకు కొన్నిచోట్ల ఆక్రమణల తొలగింపును నిలిపివేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
మరికొన్ని ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వెళ్లడానికి కూడా వీలులేని విధంగా కాలువలపై ఆక్రమణలు తొలగిస్తుండడం గమనార్హం. అంబేడ్కర్ కూడలి నుంచి వై.కూడలికి వెళ్లే మార్గంలో ప్రధాన రహదారి పక్కనున్న మురుగుకాలువ ఆక్రమణలకు గురైంది. ఈ రహదారిలో వెలిసిన భారీ నిర్మాణాలతో కాలువ ముందుకు జరిగిందని స్థానికులు పేర్కొంటున్నారు. పూడికతీత సందర్భంగా ఈ వాదనకు బలం చేకూరేవిధంగా కాలువ నిర్మాణం బయటపడింది. ఇలాంటి ఆక్రమణలు నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో చోటు చేసుకున్నాయి. ఈ తరహా ఆక్రమణలను తొలగించకుండా వరదనీటిని బయటకు ఎలా పంపగలరనే ప్రశ్నకు అధికార వర్గాల్లో సమాధానంలేదు.
వరదనీరు నిలిచిపోయే ప్రధాన రహదారులివే..
- అంబేడ్కర్ కూడలి - వై.కూడలి రహదారి
- ఆర్టీసీ బస్టాండు-జిల్లా న్యాయస్థానాల సముదాయం రహదారి
- కోటిరెడ్డి మహిళా కళాశాల-పాతబస్టాండు రహదారి
- ఒకటో గాంధీ బొమ్మ-పొట్టి శ్రీరాములు విగ్రహం రహదారి
- కృష్ణా చిత్రమందిరం కూడలి రహదారి
- ట్రాన్స్‌కో కార్యాలయం- తితిదే కల్యాణమండపం వరకు రహదారి
- కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారి
ముంపు బారిన పడే కాలనీలివే..
ఏఎస్‌ఆర్ నగర్ లోహియానగర్ ఆచారి కాలనీ ఖలీల్‌నగర్ రవీంద్రనగర్ నాగరాజుపేట మోంచంపేట గుర్రాలగడ్డ, మురాదియానగర్ గౌస్‌నగర్, ఏవన్ నగర్ ఆల్ఫా నగర్ సాయిపేట మృత్యుంజయకుంట కుమ్మరికుంట మరియాపురం మరాఠీ వీధి భవానీ నగర్ ఎస్బీఐ కాలనీ
స్వచ్ఛందంగా తొలగించుకుంటే మంచిది
నగరంలోని పలు కాలనీల్లో వరదనీరు నిలిచిపోవడానికి కారణమైన ఆక్రమణలన్నింటినీ గుర్తించాం. ఆక్రమణదారులకు తాఖీదులు సైతం జారీ చేశాం. స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించడానికి వారం రోజుల గడువు ఇచ్చాం. అప్పటికీ తొలగించకుంటే సిబ్బందే తొలగిస్తారు. అంబేడ్కర్ కూడలి- వై.కూడలి మధ్య రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో ఆక్రమణలు తొలగిస్తాం. - లవన్న, కమిషనర్, నగరపాలక సంస్థ, కడప
ఇదీ చదవండి: