రేపటి భారత్ బంద్ నేపథ్యంలో.. రైతు సంఘాల సమన్వయ సమితి, ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ప్రతినిధులు.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు చేశారు. ప్రజలు బంద్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కడప జిల్లాలో...
కడప జిల్లా మైదుకూరులో సీపీఐ, సీపీఎం నాయకులు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. సీపీఐ, సీపీఎం నాయకులు మాట్లాడుతూ.. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసి... విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. ఈ నెల 26న తలపెట్టిన బంద్‌కు అన్ని వర్గాల వారు మద్దతు ఇవ్వాలని వారు కోరారు.
భారత్ బంద్‌ను జయప్రదం చేయాలని కోరుతూ కడపలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. మోదీ సర్కార్ అధికారంలోకి రాగానే అన్ని కేంద్ర సంస్థలను ప్రైవేట్ పరం చేయడం మొదలు పెట్టారని ఆరోపించారు. రైతులకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన మూడు నూతన చట్టాలను రద్దు చేయాలని, విశాఖ ప్రైవేటీకరణ ఆపాలని, డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు.
విజయనగరం జిల్లాలో...
భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని విజయనగరం జిల్లా కురుపాంలో సీఐటీయూ నాయకుడు కొల్లిసాంబమూర్తి, తెదేపా నాయకుడు గండి కృష్ణమూర్తి ప్రజలను కోరారు. మోదీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని.. నిత్యవసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ బంద్‌లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
అనంతపురం జిల్లాలో...
భారత్ బందును విజయవంతం చేయాలని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా పెనుకొండలో ద్విచక్రవాహన ర్యాలీ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల రైతులు రోడ్డున పడుతున్నారని... ధనికులకు మాత్రం కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని అన్నారు.
విశాఖలో...
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ ప్రజా వేదిక, మహిళ సంఘాలు సంయుక్తంగా ఆందోళన చేపట్టాయి. నష్టాల పేరుతో ఉక్కు పరిశ్రమను ప్రైవేట్ పరం చేయడం సరైన పద్ధతి కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు అనే సెంటిమెంటును దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. రేపు నిర్వహించబోయే భారత్ బంద్ లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: