కడప జిల్లాలో...
కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో ఆదనపు గంటల భారన్ని అపాలని ఆందోళన చేపట్టారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి ఆధ్వానంగా ఉందని వాపోయారు.
రాజంపేటలో ఏఐటీయూసీ కార్యాలయంలో వివిధ కార్మిక సంఘాలు నిరసన చేపట్టాయి. ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రవికుమార్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎంఎస్ రాయుడు ఆరోపించారు.
కేంద్రంలోని భాజపా ప్రభుత్వం లాక్ డౌన్ సమయంలో తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా కడప జిల్లా, రైల్వేకోడూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట కార్మిక సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. భౌతికదూరం పాటిస్తూ, ప్లకార్డులు ప్రదర్శించారు.
కర్నూలు జిల్లాలో...
కరోనా తరుణంలో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులందరిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ... సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కర్నూలులో ధర్నా చేపట్టారు. కోవిడ్ విధులు నిర్వహిస్తున్నవారికి ఒక నెల జీతం అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అనంతపురం జిల్లాలో..
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అనంతపురం జిల్లా కదిరిలో సీఐటీయూ నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. కార్మికుల పనిగంటల పెంపును ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. కరోనా సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం పనిగంటలు పెంచే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు.
పశ్చిమగోదావరి జిల్లాలో..
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాల ఐక్య కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్మిక చట్టాలను కేంద్రప్రభుత్వం విస్మరిస్తుందని నాయకులు దుయ్యబట్టారు.
కార్మిక చట్టాలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో వామపక్ష అనుబంధ కార్మిక సంఘాలు ఏఐటీయూసీ , సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
గుంటూరు జిల్లాలో...
కరోనా పేరుతో కార్మిక చట్టాలను హరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆరోపించారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏఐటీయూసీ నిర్వహించిన ధర్నాలో ముప్పాళ్ల నాగేశ్వరరావు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 12గంటల పని సమయాన్ని 8గంటలకు కుదించాలని ముప్పాళ్ల డిమాండ్ చేశారు.
విశాఖ జిల్లాలో..
విశాఖ జిల్లా, మద్దిపాలెంలో ఏఐటీయూసీ కార్యాలయం ఎదుట కార్మిక సంఘాలు నిరసన చేపట్టాయి. కేంద్రప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తుందని ఏఐటీయూసీ, సీఐటీయూ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేయాలని కేంద్రం యోచిస్తోందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మూర్తి వామనమూర్తి ఆరోపించారు.
కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కొరుతూ విశాఖ జిల్లా, అనకాపల్లిలో ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. స్వయం ఉపాధి పొందుతున్న అసంఘటిత కార్మికులకు నగదు బదిలీ చేయాలని, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు.
చిత్తూరు జిల్లాలో...
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలోని బి.కొత్తకోటలో ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో రెవెన్యూ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. దేశంలోని కార్మికవర్గం అనేక త్యాగాలు, పోరాటాలు చేసి సాధించుకున్న చట్టాలను మార్పు చేయటం తగదని నాయకులు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలో...
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన ప్రదర్శన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన పథకాలను కార్మిక లోకానికి అందేటట్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి కార్మికునికి నెలకు 7500 వంతున మూడునెలలపాటు ఇవ్వాలన్నారు.