కడప జిల్లాలోని రాయచోటి దూదేకులపల్లెలో దళితుల వర్గాలపై దాడి చేసినవారిని అరెస్ట్ చేయాలని రెవెన్యూ కార్యాలయం ఎదుట అంబేడ్కర్ జన సమితి నాయకులు ధర్నా నిర్వహించారు. నిందితులను అరెస్టు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న పోలీసుల తీరును తప్పుపట్టారు. దళిత వర్గాలపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
రాయచోటిలోని 15, 16, వార్డులు కలిసి ఉన్న ప్రాంతమైన దూదేకులపల్లెలో కేవలం ఐదు కుటుంబాలు ఎస్సీ కులానికి చెందిన వారున్నారని అంబేడ్కర్ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు సుధీర్ కుమార్ అన్నారు. మంచినీటి వీధి కుళాయిలు లేని కారణంగా పక్క వీధిలోకి వెళ్లి నీళ్లు తెచ్చుకునేవారని తెలిపారు. తమ కుళాయి దగ్గరికి రావద్దనటంతో ఘర్షణ జరిగిందని పేర్కొన్నారు.
రేష్మాతో పాటు మరో ఏడుగురిని కులం పేరుతో దూషించి విచక్షణారహితంగా దాడి చేసి అవమానించారని తెలిపారు. ఘటన జరిగిన వెంటనే బాధితులు రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా.. పోలీసులు ఫిర్యాదు తీసుకోకుండా వెనక్కి పంపించారన్నారు. ఆందోళనలు చేసి పై అధికారులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఈ నెల 17న ఎస్సీ ఎస్టీ వేధింపుల కేసు నమోదు చేశారని అన్నారు.
అయినా ఇప్పటివరకు నిందితులను అరెస్ట్ చేయకపోవటం దారుణమని.. తగు చర్యల నిమిత్తం ఉప తహసీల్దారు నరసింహ కుమార్కు వినతిపత్రం అందజేశారు.
ఇది చదవండి నంద్యాల ఎస్పీవై ఆగ్రో పరిశ్రమలో విషవాయువు లీకేజీ.. ఒకరు మృతి