కడప జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసు, అటవీశాఖల అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. జిల్లాలో నాలుగు రోజుల కిందట ఎర్రచందనం దుంగలు తరలిస్తూ ప్రమాదానికి గురై అయిదుగురు ఎర్రచందనం కూలీలు సజీవ దహనం కావడంతో అప్రమత్తమయ్యారు. ప్రమాదంలో గాయపడినవారి నుంచి సేకరించిన సమాచారంతో పాలకొండలు, శేషాచల అటవీ ప్రాంతాల్లో గత రెండు రోజులుగా ముమ్మరంగా గాలిస్తున్నారు.
లక్కిరెడ్డిపల్లె సర్కిల్ అధికారి నేతృత్వంలో రామాపురం, చక్రాయపేట, లక్కిరెడ్డిపల్లె పోలీసులతోపాటు రాయచోటి అటవీశాఖ బీట్ అధికారులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి పాలకొండల్లోని గూడబండ అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలతో వస్తున్న తమిళ కూలీలు పోలీసు బృందాల కదలికలు పసిగట్టి దుంగలను అక్కడే పడేసి పరారయ్యారు. వీరి కోసం అడవిలో ముమ్మరంగా గాలిస్తున్నారు. మరోపక్క జిల్లాలోని సరిహద్దు తనిఖీ కేంద్రాలను అప్రమత్తం చేశారు. వాహనాల తనిఖీలతో పాటు కొత్త వ్యక్తుల కదలికలపై ప్రశ్నిస్తున్నారు. కూలీలు వదిలి వెళ్లిన ఎర్రచందనం దుంగల విలువను అధికారులు వెల్లడించాల్సి ఉంది.
ఇదీ చదవండి: