కడప బుగ్గవంకకు 2001లో భారీ వరద రావడంతో ఆస్తినష్టంతో పాటు పదుల సంఖ్యలో జనాలు మృతి చెందారు. ఈ ఘటన తర్వాత నాటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2005లో బుగ్గవంక సుందరీకరణకు చర్యలు చేపట్టారు. దాదాపు 70 కోట్లతో 2 సార్లు టెండర్లు పిలిచినా పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. గతేడాది నవంబర్ 26న నివర్ తుపాను సృష్టించిన బీభత్సానికి వందలమంది నిరాశ్రయులయ్యారు. వివిధ కాలనీలు నీటమునిగాయి. వారం రోజుల పాటు ప్రజలు అవస్థలు పడ్డారు. చాలా ఇళ్లు నేలమట్టం కాగా.. ఇళ్లలో ఉన్న ధాన్యం, సామగ్రి పూర్తిగా బురదమయమై.. పనికిరాకుండా పోయాయి. పెద్దఎత్తున ఆస్తి నష్టం జరిగింది. అధికార యంత్రాంగం మాత్రం ఇంట్లో ఒక్కో వ్యక్తికి కేవలం 500 రూపాయల చొప్పున పరిహారం మంజూరు చేసి చేతులు దులుపుకుంది. 3 నెలలు గడిచినా ఎవరూ తమను పట్టించుకోవడం లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నగరపాలక సంస్థ ఎన్నికల వేళ ఓట్ల కోసం వస్తే నిలదీద్దామనుకుంటే.. తమ వార్డు ఏకగ్రీవమైనందున నాయకులు ఎవరూ రావడం లేదని వాపోతున్నారు.
కడప నగర వాసులను దీర్ఘకాలికంగా వేధిస్తోన్న బుగ్గవంక వాగు సమస్యపై ప్రభుత్వం దృష్టి సారించి సుందరీకరణ పనులను పూర్తి చేయాలని కోరుతున్న స్థానికులు.. తమకు జరిగిన నష్టానికి పరిహారం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి: