వైకాపా మద్దతుతో కందుల కుటుంబసభ్యులు బలపర్చిన అభ్యర్థి రవణమ్మ గెలుపు కోసం మాజీ ఎమ్మెల్యే కందుల శివానందరెడ్డి కుమారుడు చంద్ర ఓబుల్ రెడ్డి (నాని) గ్రామంలో గడప గడపకు తిరుగుతూ ప్రచారం మొదలుపెట్టాడు. గత నెలలో జరిగిన నాల్గవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వేంపల్లె మండలంలోని టి.వెలమవారిపల్లె గ్రామ పంచాయతీకి సంబంధించిన నామినేషన్లు ఇరువర్గాల అభ్యర్థులు ఉపసంహరణ చేయడంతో ఎన్నిక వాయిదా పడింది. మళ్లీ ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో 4వ తేదీ నుండి 10వ తేదీ వరకు నామినేషన్ల దాఖలు, ఉపసహరణ ప్రక్రియ జరిగింది.
వైకాపాలోనే కందుల కుటుంబ వర్గీయులు, మరో వైకాపా నాయకుల వర్గీయులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. టి.వెలమవారిపల్లె సర్పంచ్ పదవి ఏకగ్రీవం చేసేందుకు ఇరువర్గాలు మధ్య సయోధ్య కుదరకపోవడంతో పోటీ అనివార్యం అయ్యింది. ఇరువర్గాలు నామినేషన్లు ఉపసంహరించుకోలేదు. దీంతో సర్పంచ్ పదవికి వైకాపా మద్దతుతో కందుల కుటుంబం తరుపున రవణమ్మ పోటీలో నిలవగా.. మరో వైకాపా వర్గం తరుపున లతీఫా పోటీలో నిలిచారు.
టి.వెలమవారిపల్లె పంచాయతీలో మొత్తం10 వార్డులు ఉండగా.. ఒకటో వార్డుకు నామినేషన్ దాఖలు కాకపోవడంతో చవ్వా భారతీ ఏకగ్రీవం అయ్యారు. దీంతో సర్పంచ్ పదవికి, 9 వార్డులకు ఈనెల 15న ఎన్నికలు జరగనున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. టి. వెలమవారిపల్లెలో 1647 ఓట్లు ఉండగా వాటిలో పురుషుల ఓట్లు 827, మహిళల ఓట్లు 825 ఉన్నాయి. పులివెందుల నియోజకవర్గంలోని 109 గ్రామ పంచాయతీల్లో వైకాపా 108 గ్రామ పంచాయతీలు కైవసం చేసుకున్నప్పటికీ వేంపల్లె మండలంలోని కందుల శివానందరెడ్డి సొంత ఊరైనా టి. వెలమవారిపల్లె గ్రామ పంచాయతీ ఏకగ్రీవం కాలేదు. దీంతో ఎన్నికలు రసవత్తరంగా జరిగే అవకాశం ఉంది. తాము వైకాపా పార్టీకి నిజమైన నాయకులం తామేనని కందుల చంద్రఓబుల్ రెడ్డి నాని తెలిపారు. 9వార్డు సభ్యులకు, సర్పంచ్ అభ్యర్థులకు గుర్తులు కూడా అధికారులు కేటాయించడంతో అయా వర్గాల అభ్యర్థులు ప్రచారం చేసుకొంటున్నారు. గెలుపు, ఓటములపై అప్పుడే ఆ గ్రామ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా ముప్పై ఐదు సంవత్సరాల తరువాత ఈ టి.వెలమవారి పల్లి గ్రామ పంచాయతీకి జరగనున్న ఎన్నికలు రసవత్తరంగా మారాయి.
ఇదీ చదవండి: