కడప జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు... ఎన్టీఆర్ 25వ వర్థంతిని తెదేపా నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలు చోట్ల రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు.
రైల్వేకోడూరు నియోజకవర్గంలో..
రైల్వేకోడూరు నియోజకవర్గంలో ఎన్టీఆర్ వర్థంతిని.. తెదేపా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిర్వహించారు. నియోజకవర్గ తెదేపా ఇంఛార్జ్ కస్తూరి విశ్వనాధ నాయుడు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ సర్కిల్లోని తారకరామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్డు పంచారు. అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆయన అభిమానులు ఓబణపల్లిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆయన చేసిన సేవలను కొనియాడుతూ.. ఎన్టీఆర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు.
జమ్మలమడుగు నియోజకవర్గంలో..
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకడు నందమూరి తారక రామారావు 25వ వర్ధంతి కార్యక్రమాన్ని జమ్మలమడుగు నియోజకవర్గంలో తెదేపా నేతలు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. పొన్నతోట గ్రామంలో తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున, మండల తెదేపా అధ్యక్షుడు పొన్నతోట శీను ఆధ్వర్యంలో వర్థంతి కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలలకే అధికారం చేపట్టిన మహానుభావుడని పార్టీ నేతలు కొనియాడారు. స్త్రీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడంలో ఆయన పాత్ర ముఖ్యమైనదని అన్నారు. కిలో రెండు రూపాయల బియ్యం, జనతా వస్త్రాలు వంటి సంక్షేమ పథకాలెన్నింటినో ప్రవేశపెట్టారని తెలిపారు. ఎన్టీఆర్ ఆశయాల కోసం చంద్రబాబునాయుడు ముందుండి నడిపిస్తున్నారని పేర్కొన్నారు.
బద్వేలులో..
బద్వేలులో నందమూరి తారక రామారావు 25 వ వర్థంతిని తెదేపా శ్రేణులు, అభిమానులు జరుపుకున్నారు. నెల్లూరు రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీఆర్..పేదలకు ఎన్నో సంక్షేమ ఫలాలను అందించారని కొనియాడారు.