ప్రతి నెలా ఒకటో తేదీన అవ్వా..తాతలు, వితంతువులు, వికలాంగులకు ఇచ్చే సామాజిక పింఛను నగదు రవాణా అభద్రత మధ్య కొనసాగుతోంది. బ్యాంకు నుంచి గ్రామ సచివాలయం వరకు నగదును తీసుకొచ్చే బాధ్యతను ఆయా గ్రామ సచివాలయాల్లో పనిచేసే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ సహాయకులకు అప్పగించారు. వీరు ప్రతినెలా చివరి తేదీన పంచాయతీ కార్యదర్శి నుంచి చెక్కును తీసుకొని పట్టణంలో వీరికి కేటాయించిన బ్యాంకుకు వెళ్లి నగదుగా మార్చుకోవాలి. లక్షలాది రూపాయల నగదును వీరొక్కరే ఒంటిరిగా సంబంధిత గ్రామ సచివాలయం వద్దకు తీసుకెళ్లి గ్రామ వాలంటీర్లకు అందజేయాలి. పట్టణంలోని వార్డు సచివాలయాల్లో పనిచేసే వెల్ఫేర్ సహాయకులకు నగదు రవాణా పెద్ద సమస్య కాదు గాని ఎటొచ్చి పల్లెల్లో పనిచేసే గ్రామ సచివాలయ సంక్షేమ కార్యదర్శికే నగదు రవాణా కష్టసాధ్యంగా మారుతోంది.
ముఖ్యంగా సంక్షేమ కార్యదర్శులుగా మహిళలు ఉన్నచోట్ల వీరి అవస్థలు అన్నీ ఇన్నీ కావు. బస్సు లేదా ఆటో సౌకర్యం లేని మారుమూల గ్రామాలకు ద్విచక్ర వాహనంపై.. అది కూడా ఒక మహిళా ఉద్యోగి లక్షలాది రూపాయల నగదును ఒంటరిగా తీసుకెళ్లడం కష్టసాధ్యమైన పనే.. అందునా ప్రతి నెలా 30, 31వ తేదీన ఫలానా ఉద్యోగి బ్యాంకుకు వెళ్లి పింఛను డబ్బులను తీసుకొస్తున్నారన్న విషయం అందిరకీ తెలుసు. ఈ క్రమంలో నగదు రవాణాకు ప్రభుత్వం ఎలాంటి రక్షణ ఇవ్వలేదు. తమకు భద్రత కల్పించమని సంబంధిత సంక్షేమ కార్యదర్శులు తమ ఉన్నతాధికారులను అడిగే ధైర్యం చేయలేకపోతున్నారు. మారుమూల గ్రామాలకు నగదును చేర్చే క్రమంలో పొరపాటున దోపిడికి గురైతే పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో నగదు రవాణా భద్రతపై నీలినీడలు అలముకున్నాయి.
ప్రత్యామ్నాయం ఆలోచించాలి
అవ్వాతాతలకు ప్రతినెలా ఒకటో తేదీనే ఠంఛనుగా పింఛన్లను అందజేయడంలో రాజీపడాల్సిన అవసరం లేదు. అదే సమయంలో లక్షలాది రూపాయల నగదు రవాణా అభద్రత మధ్య కొనసాగుతుండడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలి. సంక్షేమ కార్యదర్శికి తోడుగా మరో ఉద్యోగిని పంపడమా..? లేక సచివాలయానికి సమీపంలోని గ్రామీణ బ్యాంకుకు లేదా పోస్టాఫీసు నుంచి నగదును డ్రా చేసుకునే సదుపాయాలను కల్పించాలి. జిల్లాలో చాలా మండలాల్లోని గ్రామాలకు ఎలాంటి ప్రజారవాణా సౌకర్యం లేదు. బ్యాంకు నుంచి నగదును తీసుకెళ్లాలంటే తప్పనిసరిగా ద్విచక్రవాహనంపై వెళ్లాల్సిందే. అక్కడి సంక్షేమ కార్యదర్శులు ప్రతి నెలా చివరి తేదీన సచివాలయానికి వెళ్లి చెక్కు తీసుకొని తిరిగి జమ్మలమడుగు పట్టణానికి వచ్చి ఇక్కడి ఆంధ్రాబ్యాంకులో చెక్కును నగదుగా మార్చుకొని ఆ డబ్బును 20-30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామ సచివాలయాలకు ఒంటరిగా ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తున్నారు. మార్గమధ్యంలో ఏమైనా జరిగితే బాధ్యత ఎవరిది?
అడిగితే భద్రత కల్పిస్తాం...
పెద్ద మొత్తంలో నగదును తీసుకొని మహిళా ఉద్యోగి మారుమూల పల్లెలకు ద్విచక్ర వాహనంపై ఒంటిరిగా వెళ్లడం మంచిది కాదు. ఈ విషయం ఇంతవరకు నా దృష్టికి రాలేదు. పంచాయతీరాజ్‌శాఖ అధికారులు కోరితే పోలీసు భద్రత అవసరమని భావించిన ప్రాంతాలకు తప్పకుండా పోలీసులను పంపిస్తాం. రెండు, మూడు రోజుల్లో సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణను తయారు చేస్తాం. - అన్బురాజన్, ఎస్పీ
ఇదీ చదవండి: ప్రజారోగ్య విభాగానికి అవినీతి జబ్బు