కడప జిల్లాలో చూడదగ్గ ప్రదేశాల్లో గండికోట ఒకటి. అందుకే దీని అభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆ ఖర్చుకు ఫలితం కనిపించడం లేదు. నీళ్లు పోసేవారు లేక పర్యటకులను ఆకర్షించేందుకు తీసుకొచ్చిన ఖరీదైన మొక్కల వాడి పోయాయి. ఖాళీ పూలకుండీలు దర్శనమిస్తూ వెక్కిరిస్తున్నాయి.
గండికోటను అభివృద్ధికి ప్రభుత్వం లక్షలు నిధులు వెచ్చిస్తున్నా... క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. పచ్చదనం కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రజాధనం వృథా అవుతోంది. కోట చూసేందుకు వస్తున్న పర్యటకులను మరింతగా ఆకర్షించేందుకు తూర్పుగోదావరి జిల్లా కడియం నుంచి మొక్కలు తీసుకొచ్చి పెంచారు.
ఈ మొక్కల కోసం రూ. 28 లక్షలు ఖర్చు చేశారు. కోట ముఖద్వారం, జుమ్మా మసీదు, రంగనాథస్వామి ఆలయం, మాధవరాయ స్వామీ ఆలయం తదితర ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశారు. ఇంత ఖర్చు చేసినా... సరైన సమయానికి మొక్కలకు నీళ్లు పోసేవారు లేక అవన్నీ వాడిపోయాయి. పర్యటక శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా లక్షల రూపాయల సొమ్ము వృథాగా పోయింది.