Lokesh Challenge to Jagant: బద్వేలు నియోజకవర్గంలో వైసీపీ నాయకులు భూకబ్జాలు తారస్థాయికి చేరాయని వ్యాఖ్యానించారు. యువగళం పేరుతో నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర 124వ రోజు వైయస్సార్ జిల్లా బద్వేలు పట్టణంలో విజయవంతంగా సాగింది. బద్వేల్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిర్వహించిన బహిరంగ సభకు జనం పోటెత్తారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ ఉత్సాహంగా ప్రసంగించారు. వైసీపీ నాయకులు నన్ను సీమలో అడుగుపెట్టనివ్వం అని సవాల్ చేసారు.. నాలో ఉన్నదీ సీమ రక్తమేరా సిల్లీ ఫెలోస్. సవాల్ చెయ్యాలంటే హిస్టరీ ఉండాలి.. అడ్డుకోవాలి అంటే దమ్ముండాలనీ హెచ్చరించారు. ఆ రెండూ వైసీపీ నాయకులకు లేవు. క్లైమోర్మైన్లకే భయపడని కుటుంబం మాది.. కోడికత్తి బ్యాచ్‌కి భయపడతామా ? అన్నారు. అడ్డొచ్చిన వైసీపీ సైకోలను సీమ సందుల్లో తొక్కుకుంటూ పోతాం అని నారా లోకేశ్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
124 రోజులు, 44 నియోజకవర్గాలు, 1587 కిలోమీటర్లు. సీమ గడ్డపై యువగళం ఒక హిస్టరీ. సీమ పౌరుషం ఏంటో తాడేపల్లి ప్యాలస్‌కి చూపించాం అని పేర్కొన్నారు. సీమలో నన్ను ఆశీర్వదించిన ప్రజలందరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. సీమ జగన్‌కి చాలా ఇచ్చింది... జగన్ సీమకి ఎం ఇచ్చాడు? అని ప్రశ్నించారు. సీమ జగన్‌ని సీఎం చేసింది, సంపద ఇచ్చింది. 49 మంది ఎమ్మెల్యేలను ఇచ్చింది. 8 మంది ఎంపీలను ఇచ్చింది. జగన్ సీమకి ఇచ్చింది ఏంటి? జగన్ సీమ బిడ్డ కాదు సీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ అని లోకేశ్ విమర్శించారు.
టీడీపీ చేసిన అభివృద్ధిలో పది శాతం కూడా జగన్ సీమలో చెయ్యలేదు. సాగు, తాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు, పేదలకు ఇళ్లు, రోడ్లు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది టీడీపీ అని లోకేశ్ గుర్తు చేశారు. జగన్ సీమ ప్రజల్ని చీట్ చేసాడు. ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి చెయ్యలేదు. ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు. ఒక్క ఇటుక పెట్టలేదు అని విమర్శించారు. బద్వేల్ గడ్డపై నిలబడి సవాల్ చేస్తున్నా.. 'సీమకు నువ్వు చేసింది ఏంటో చెప్పు... నేను చర్చకు సిద్ధం.. ఎప్పుడు వస్తావో చెప్పు జగన్' అని లోకేశ్ సవాల్ విసిరారు. 2019లో జగన్ కి ఇచ్చిన మ్యాండేట్ 2024లో మాకు ఇవ్వండి. జగన్ కి ఇచ్చిన 49 సీట్లు మాకు ఇవ్వండి. సీమ సత్తా ఏంటో దేశానికి చూపిస్తాం అని లోకేశ్ వ్యాఖ్యానించారు. సీమకు ఏం చేస్తామో మిషన్ రాయలసీమలో చెప్పాం. మిషన్ రాయలసీమ అమలు చేసి సీమని నిలబెడతాం. ఒకవేళ ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోతే ఇదే బద్వేల్ సెంటర్లో చొక్కా పట్టుకొని నిలదీయండి అని లోకేశ్ బద్వేలు ప్రజలకు పిలుపునిచ్చారు.
'బద్వేలు నియోజకవర్గంలో వైసీపీ నాయకులు భారీ స్థాయిలో భూకబ్జాలకు పాల్పడుతున్నారు. ఈ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్సీ గోవిందరెడ్డితోపాటు అనేకమంది వైసీపీ నేతలు ప్రభుత్వ భూములు పేదల భూములు కబ్జా చేసి ఓట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు. ఏకంగా బద్వేల్ ఎమ్మెల్యే భూమిని కబ్జా చేశారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు'- నారా లోకేశ్, టీడీపీ జాతీయ కార్యదర్శి