YS Vivekananda Reddy murder case: వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణలో సమూల మార్పులు చోటుచేసుకోనున్నాయి. కడప సెషన్స్ కోర్టు నుంచి కేసు దస్త్రాలన్నీ హైదరాబాద్ సీబీఐ కేర్టుకు చేరాయి. నిందితులనుకూడా త్వరలోనే కడప జైలు నుంచి హైదరాబాద్ జైలుకు తరలించే అవకాశం ఉంది. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి విచారణకు 5 రోజుల గడువు కోరడంతో మళ్లీ పిలిచేందుకు సీబీఐ సమాయాత్తమవుతోంది.
ఛార్జిషీట్లు, సాక్షుల వాంగ్మూలాలు..సీబీఐ కోర్టుకు: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ అయిన నేపథ్యంలో ఇక విచారణంతా హైదరాబాద్ కేంద్రంగానే సాగనుంది. కేసుకు సంబంధించి కడప సెషన్స్ కోర్టులో ఉన్న ఛార్జిషీట్లు, సాక్షుల వాంగ్మూలాలు హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు తరలించారు. కోర్టు సిబ్బంది ఆయా దస్త్రాలను పరిశీలించి తాజాగా ఫైళ్లను రూపొందించి వాటిని సీబీఐ కోర్టు న్యాయమూర్తి ముందుంచాల్సి ఉంటుంది. ఆ తర్వాత పాత కేసు నంబర్ స్థానంలో కొత్తది కేటాయిస్తారు. అనంతరం సీబీఐ కోర్టు నిందితులకు తాజాగా సమన్లు జారీ చేయనుంది. అక్కడి నుంచి ప్రతి విచారణకునిందితులకు హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు విచారణకే హాజరుకావాల్సి ఉంటుంది.
కోర్టు నుంచే అనుమతి: నిందితుల రిమాండ్ పొడగించాలన్నా ఇకపై హైదరాబాద్‌లోని కోర్టు నుంచే అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఫలితంగా కడప జైలులో ఉన్న నిందితులు ఉమాశంకర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, సునీల్ యాదవ్‌ను వీడియోకాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచే అవకాశం ఉంది. మరోవైపు నిందితులను త్వరలోనే హైదరాబాద్‌లోని జైలుకే తరలించే అవకాశం ఉందని పోలీస్ వర్గాలు తెలిపాయి.
అవినాష్‌కు మరో దఫా నోటీసులు: ఇక న్యాయప్రక్రియతోపాటు దర్యాప్తు ప్రక్రియ కూడా హైదరాబాద్ సీబీఐ కార్యాలయ కేంద్రంగానే సాగనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే అవినాష్ రెడ్డిని హైదరాబాద్‌కే రావాలని కోరింది. ఐతే.. అవినాష్‌రెడ్డి 5 రోజుల గడువు కోరడంపై సీబీఐ ఇంకా స్పందించలేదు. అవినాష్‌కు మరో దఫా నోటీసులు ఇవ్వడానికి అధికారులు సిద్ధం చేస్తున్నారు. మరికొందరు అనుమానితులకూ నోటీసులు ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి