కన్నతల్లే ముగ్గురు పసివాళ్లను గొంతు నులిమి కడతేర్చిన ఘటన... కడప జిల్లాలో సంచలనం సృష్టించింది. మూడేళ్ల లోపు వయసున్న అభంశుభం తెలియని చిన్నారులు... ఈ అమానుష ఘటనలో మృతి చెందారు. ఆత్మహత్యాయత్నం చేసిన తల్లి... చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.
పెండ్లిమర్రి మండలం మిట్టమీదపల్లెకు చెందిన నిత్య పూజారి, నరసమ్మకు ముగ్గురు పిల్లలు. వారిలో పెద్దోడి వయసు మూడేళ్లు, అమ్మాయికి రెండేళ్లు కాగా... మరొకరు రెండు నెలల పసివాడు. కూలి పనిపై ఆధారపడి జీవించే ఈ కుటుంబంలో చిన్నపాటి తగాదాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో చావే దిక్కనుకున్న నరసమ్మ... భర్త పనికి వెళ్లిన సమయంలో అఘాయిత్యానికి పాల్పడింది. ముగ్గురు పిల్లలను గొంతు నులిమి చంపి, తానూ పురుగుల మందు తాగింది.
అత్త పేరిట ఉన్న భూమి విషయంలో భర్తతో నరసమ్మ కొంతకాలంగా ఘర్షణ పడుతున్నట్లు బంధువులు తెలిపారు. భర్త తరపు కుటుంబసభ్యులతోనూ దూరం పాటిస్తున్నట్లు తెలుస్తోంది. ఘటన గురించి వివరిస్తూ కడప డీఎస్పీ సునీల్ భావోద్వేగానికి గురయ్యారు. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి ఆస్పత్రికి వచ్చి, బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ కలహాలకు పసివాళ్లు బలైన విషాద ఘటన గ్రామస్థులను కలచివేసింది.
ఇదీ చదవండీ... కొత్తగా ఎన్నికైన మేయర్లు, ఛైర్మన్లు వీళ్లే..