ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సహకారంతో కడప జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. తనకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన కడప నియోజకవర్గ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని ఆయన తెలిపారు.
2005లో కడప నగర పాలక సంస్థ కార్పొరేటర్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన అంజాద్‌బాషా.. 2014, 2019లో వైకాపా ఎమ్మెల్యేగా కడప నుంచి రెండుసార్లు భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇవాళ జరిగిన కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశానికి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన హాజరయ్యారు. మేయర్ సురేశ్ బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్న అంజాద్ బాషాను కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ ఉద్యోగులు ఘనంగా సత్కరించారు. నగరంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని... శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామని అంజాద్ బాషా అన్నారు. పదేళ్లుగా కడప జిల్లా నిర్లక్ష్యానికి గురైందని.. ముఖ్యమంత్రి జగన్ జిల్లావాసి అయినందున అన్ని విధాలుగా అభివృద్ధిలో పరుగులు పెడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. మైనారిటీల సంక్షేమానికి, వక్ఫ్ బోర్డు స్థలాలు పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు.