ఇటీవల కురిసిన వర్షాలకు కడప జిల్లా వీరబల్లి మండలం గడికోట గ్రామంలో మాండవ నదిపై చిన్నపాటి కాజ్వే కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలు స్తంభించాయి. నదికి అవతల ఉన్న వీరయ్య గారి పల్లి, రెడ్డి వారి పల్లి, పెద్దూరు కస్పా, వేల్పుల మిట్టతో కలిసి సుమారు 14 గ్రామాలకు రాకపోకలు స్థంభించాయి. నదిపై నిర్మించిన రోడ్డు దెబ్బతినడంతో బస్సులు, ద్విచక్ర వాహనాలు రాకపోకలు ఆగిపోయాయి.
విద్యార్థులు నది అవతల ఉన్న పెద్దూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చేరుకోలేక అవస్థలు పడుతున్నారు. నీటిలో దిగితే ప్రమాదమని తెలిసి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఏటా నీటి ప్రవాహానికి రోడ్డు కొట్టుకుపోవడం.. అధికారులు తాత్కాలిక మరమ్మతులతో సరి పెట్టడంతో శాశ్వత పరిష్కారం లభించడం లేదు.
వర్షాకాలంలో తాము పండించిన పంట మార్కెట్కు తరలించి లేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. నదిపై భారీ వంతెన నిర్మిస్తే సమస్య తలెత్తదని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉన్నతాధికారులు ప్రజా ప్రతినిధులు ఈ నదిపై శాశ్వత వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి: ఫోన్ చూస్తే తండ్రి తిడుతున్నాడని కుమారుడి కిడ్నాప్ డ్రామా...