కడప జిల్లా పులివెందులలో ఓ యువకుడు లాకప్‌డెత్‌కు గురయ్యాడన్న వార్త తీవ్ర సంచలనం రేపింది. జైల్లో ఉన్న అతన్ని పోలీసులు కొట్టడం వల్లే మృతి చెందాడని పలువురు ఆరోపిస్తున్నారు. మరోవైపు రాత్రికి రాత్రే మృతదేహాన్ని ఖననం చేయడం.. ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.
అహోబిలపురం కాలనీకి చెందిన అశోక్ కుమార్ అలియాస్ అక్కులప్ప అనే వ్యక్తిని దొంగతనం కేసులో పోలీసులు ఆదివారం అరెస్టు చేసి జైల్లో పెట్టారు. పోలీస్‌స్టేషన్‌లో అశోక్‌కుమార్ మృతి చెందినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం బయట పొక్కకుండా అధికార పార్టీ చెందిన కీలక నాయకుడు పంచాయతీ చేసినట్లు సమాచారం.
అనంతరం స్థానిక హిందూ శ్మశాన వాటికలో అశోక్ మృతదేహాన్ని ఖననం చేశారు. ఈ తతంగానికి ముందు మృతుడి సోదరితో పోలీసులు పేపర్లపై సంతకాలు తీసుకున్నారని చెప్పుకుంటున్నారు. ఈ విషయం పులివెందుల డీఎస్పీ శ్రీనివాస్‌ను అడగ్గా.. అశోక్‌ది లాకప్ డెత్ కాదని అనారోగ్యంతో మృతి చెందాడని మృతుడి చెల్లెలు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసిందని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు వెల్లడించారు.
అశోక్ చిన్నప్పుడే తల్లి కువైట్ వలస వెళ్లగా.. తండ్రి అనారోగ్యంతో చనిపోయాడు. అతనికి ఒక చెల్లెలు ఉంది. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో ఒక యువతిని పెళ్లి చేసుకొని అశోక్ అక్కడే ఉంటున్నాడు. ఇతనిపై పలు దొంగతనాలు కేసులు ఉన్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: viveka murder case: వైఎస్ వివేకా కేసు..అనుమానితుల ఇళ్లలో ఆయుధాలు స్వాధీనం