Left Parties Protest Against Police: ఉద్యమం చేస్తున్న వారిని అసభ్య పదజాలంతో ధూషించి తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్న కడప తాలూకా సీఐ, ఇద్దరు ఎస్సైలపై చర్యలు తీసుకోవాలని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి శంకర్ రెడ్డి డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి సర్కార్ పోలీసులను అడ్డుపెట్టుకొని ఉద్యమాలను అణిచివేస్తున్నారని విమర్శించారు.
పక్క రాష్ట్రాలలో నిరసనలు, ధర్నాలు చేస్తుంటే అక్కడ అధికార పార్టీలు నోరు మెదపడం లేదు.. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఏ చిన్న ఉద్యమం చేసినా పోలీసులతో ముందస్తు అరెస్టులు చేయిస్తున్నారని మండిపడ్డారు. గృహనిర్బంధం చేయడం, బయటికి రానికుండా నిర్బంధించడం సరైనది కాదని ఖండించారు.
కడప తాలూకా పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ కడప కలెక్టరేట్ ఎదుట అఖిలపక్షం పార్టీల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పది రోజుల క్రిందట సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచార భేరి కార్యక్రమంలో భాగంగా కడప ఐటీఐ కూడలి వద్ద సభ నిర్వహించేందుకు వెళ్తున్న వామపక్షాలను పోలీసులు అడ్డుకోవడం విచక్షణ రహితంగా వారిపై దాడి చేసి.. అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపించారు.
అంతటితో ఆగకుండా తప్పుడు కేసులు పెడతామని బెదిరించడం సమంజసం కాదని ఖండించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఆందోళన చేసిన దాఖలాలు ఉన్నాయని.. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. పోలీసులు పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కేవలం అధికార పార్టీ వారికే వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. వామపక్షాల నాయకులపై తప్పుడు కేసులు పెడతామని బెదిరించిన పోలీసులను సస్పెండ్ చేయకుంటే ఉద్యమాన్ని.. మరింత పెద్ద ఎత్తున నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు.
"కడప జిల్లాలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంది. ప్రజా ఉద్యమాలపై యథేచ్ఛగా దాడులు, దౌర్జన్యాలు సాగుతున్నాయి. ఏ చిన్న కార్యక్రమాన్ని చేసుకోవాలన్నా పోలీసులు నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు. ఇళ్ల నుంచి బయటకు రాకుండా అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రజా ఉద్యమాలని, పోరాటాలని అణచివేయాలని జగన్మోహన్ రెడ్డి పోలీసులను వాడుకుంటున్నారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారు. కొడుతున్నారు. ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. దేశంలో వివిధ రాష్ట్రాలలో ఉద్యమాలు జరుగుతున్నాయి.. కానీ ఎక్కడా ఈ విధంగా అణచివేయడం లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి నువ్వు మఖ్యమంత్రి పదవి కోల్పోయిన తరువాత.. నీకు కూడా ఈ విధంగా చేస్తే ఊరుకుంటావా అని ప్రశ్నిస్తున్నాము". - రవి శంకర్ రెడ్డి, రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఇవీ చదవండి: