కడప రీజియన్ పరిధిలోని కడప, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, బద్వేలు, రాయచోటి, రాజంపేట డిపోల ద్వారా 62 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్టీసీ ఆర్జించింది. ఏప్రిల్, మే నెలల్లో సరాసరి రోజుకు కోటి రూపాయల వరకు లాభాన్ని గడిచింది. ఈ డిపోల పరిధిలో సుమారు 850 బస్సులు నడుపుతుండగా.... 3 వేల మంది డ్రైవర్లు, 2 వేల మంది కండక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నికలు, శుభకార్యాలు, వేసవి సెలవులు ఇలా అన్నీ ఒకేసారి వచ్చినందున ప్రయాణికుల తాకిడి ఎక్కువైంది. వారాంతపు సెలవుల్లో రద్దీ రెట్టింపు అయినప్పటికీ ప్రయాణికులకు అనుగుణంగా బస్సులు నడిపారు.
కార్మికుల కష్టం
కడప జిల్లాలో వేసవిలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ డ్రైవర్లు, కార్మికులు అంకితభావంతో పనిచేసి ఆర్టీసీని లాభాల బాట పట్టించారు. అధికారులు కూడా బస్సుల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మరమ్మతులు చేయించారు. ఫలితంగా ఏప్రిల్, మే మాసాల్లో కడప రీజియన్‌కు రోజుకు సరాసరి కోటి చొప్పున... 60 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది.
త్వరలో అభినందన సభ
గడిచిన 5,6 సంవత్సరాల్లో ఈ స్థాయిలో ఆదాయం రాలేదు. కడప జిల్లా ఆర్టీసీకి 60 కోట్ల రూపాయలు ఆదాయం తీసుకురావడంలో కృషి చేసిన కార్మికులకు త్వరలో అభినందన సభ ఏర్పాటు చేస్తామని అధికారులు పేర్కొన్నారు .