కేంద్రం చేపట్టిన జల్ శక్తి అభియాన్ పథకంలో కడప జిల్లాకు మొదటి స్థానం వరించింది. దేశవ్యాప్తంగా వర్షాభావం, కరవు ప్రభావంతో భూగర్భజలాలు అడుగంటుతున్న తరుణంలో.... వాననీటి సంరక్షణే లక్ష్యంగా కేంద్రం ఈ కార్యక్రమం చేపట్టింది. దేశవ్యాప్తంగా 255 జిల్లాల్లో... మొదటి విడత జులై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకూ పథకం అమలైంది.
దేశంలోనే ప్రథమం
రాష్ట్రంలో 9 జిల్లాల్లో... కడప జిల్లాలోని 13 మండలాల్లో... జల్‌శక్తి అభియాన్ అమలుచేశారు. 255 జిల్లాల్లో ర్యాంకుల ఆధారంగా కేంద్ర జల్‌శక్తి అభియాన్ అధికారులు మార్కులు ప్రకటించగా.... 80.38 మార్కులతో కడప దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని ఇతర జిల్లాలు 30 మార్కులతో సరిపెట్టుకున్నాయి. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా 78.27 మార్కులతో రెండోస్థానంలో నిలవగా... గుజరాత్‌లోని బనస్ కాంత్ జిల్లా 77.62 మార్కులతో మూడో స్థానం సాధించింది.
రైతులకు అవగాహన
జల్‌శక్తి అభియాన్ పథకంలో ప్రధానంగా 5 అంశాల ఆధారంగా కేంద్రం మార్కులు కేటాయించింది. ఎంపిక చేసిన జిల్లాల పరిధిలో వాననీటి సంరక్షణ నిర్మాణాలు, సంప్రదాయ నీటి వనరుల పునరుద్ధరణ, రీఛార్జ్ నిర్మాణాలతో బోరు బావుల పునరుద్ధరణ, వాటర్ షెడ్ల అభివృద్ధి, అటవీకరణ విభాగాల్లో... ర్యాంకులు కేటాయించింది. కడప జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టిన అధికారులు... 60 వేలా 207 కిసాన్ మేళాలతో రైతులకు వాననీటి సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
జల్ శక్తి అభియాన్ రెండో విడతలో అమలు చేసే పథకంలోనూ..... స్థానం పదిలం చేసుకుంటామని డ్వామా అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:నవ్యాంధ్రలో జల శక్తి అభియాన్‌కు శ్రీకారం