బద్వేలు ఉపఎన్నికలో జనసేన పోటీ చేయడం లేదని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వెల్లడించారు. మరణించిన ఎమ్మెల్యే భార్యకే టికెట్ ఇచ్చినందున మానవతా దృక్పథంతోనే బద్వేలులో పోటీ చేయడం లేదన్నారు. నియోజకవర్గానికి చెందిన జనసేన నేతలతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
బద్వేల్ ఉపఎన్నిక ఎందుకంటే..
కడప జిల్లా బద్వేలు శాసనసభ స్థానానికి ఉపఎన్నికకు రంగం సిద్ధమైంది. శాసనసభ్యుడు వెంకటసుబ్బయ్య ఆకస్మిక మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కొవిడ్‌తో వాయిదా పడిన ఎన్నికలను అక్టోబరులో నిర్వహించేందుకు ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూలు విడుదల చేసింది. దివంగత ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య భార్య సుధను అభ్యర్థిగా వైకాపా మంగళవారం అధికారికంగా ప్రకటించింది. గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిన అభ్యర్థి రాజశేఖర్‌నే తిరిగి రంగంలో నిలుపుతున్నట్లు తెదేపా కొద్దివారాల క్రితం తెలిపింది. 2019 సాధారణ ఎన్నికల తరువాత రాష్ట్రంలో శాసనసభకు ఉపఎన్నిక జరగటం ఇదే తొలిసారి. తిరుపతి లోక్‌సభ స్థానానికే ఉపఎన్నిక జరిగింది. కిందటి సాధారణ ఎన్నికల్లో వైకాపా 44,734 ఓట్ల ఆధిక్యంతో తెదేపాపై గెలుపొందింది.
ఇదీ చదవండి: PAWAN KALYAN : 'వచ్చే ఎన్నికల్లో జనసేనదే అధికారం'