Inter Student Suicide Narasaraopet : నేటి కాలంలో చాలా మంది యువత చిన్నచిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రేమ విఫలమైందని ఒకరు, పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయని మరొకరు, తల్లిదండ్రులు మందలించారని ఇంకొందరు. ఇలా వివిధ కారణలతో బలవన్మరణానికి పాల్పడుతున్నారు. కారణం ఏదైనా విలువైన జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. ఫలితంగా అనాలోచితంగా తీసుకున్న నిర్ణయాలతో తమను నమ్ముకున్న తల్లిందండ్రులను విషాదంలోకి నెట్టేస్తున్నారు.
తాజాగా విద్యార్థుల మధ్య చిచ్చుపెట్టిన పెన్నుల తగువు ఒక బాలిక ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. నరసరావుపేట శివారులోని ఓ కళాశాల హాస్టల్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామానికి చెందిన జెట్టి హనుమంతరావు కుమార్తె అనూష(16) సదరు కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. ఇటీవల హాస్టల్‌లో పెన్నులు కనిపించకుండా పోతున్నాయి. నాలుగు రోజులుగా అనూషకు, ఆమె స్నేహితురాళ్లకు మధ్య వివాదాలు జరుగుతున్నాయి.
ఈ వ్యవహారం పరస్పర ఆరోపణలతో ఒకరినొకరు దూషించుకోవడం వరకు వెళ్లింది. ఈ పరిణామాల నేపథ్యంలో మనస్తాపానికి గురైన అనూష శనివారం ఉదయం 8 గంటల సమయంలో కళాశాల హాస్టల్ భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఇది గమనించిన సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు కాలేజీకి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు. వారు రోదించిన తీరు అక్కడివారిని కలిచి వేసింది.
పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలి తండ్రి హనుమంతరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు నరసరావుపేట ఆర్డీవో (రెవెన్యూ డివిజినల్ ఆఫీసర్) హేమలత, తహసీల్దార్ వేణుగోపాల్, కళాశాలకు చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
'ప్రేమించిన అమ్మాయికి ఉద్యోగం' - తను కుటుంబానికి ఏమీ చేయలేకపోతున్నానని మనస్థాపం
ప్రేమ పేరుతో బాలుడి వేధింపులు - ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య