ఎంపీగా ఆయన.. ఎమ్మెల్యేగా ఈయన!
జమ్మలమడుగు.... ఎన్నికల కూత పెట్టకముందే అధికార పార్టీలోనే కాదు కడప జిల్లా రాజకీయాల్లో హీట్ పెంచింది ఈ నియోజకవర్గం. జమ్మలమడుగు జగడానికి పరిష్కారమేంటి అన్న సమయంలో.. తెదేపా అధినేత చంద్రబాబు చాకచక్యంగా వివాదాన్ని పరిష్కరించారు. ఎమ్మెల్సీగా ఉన్న రామసుబ్బారెడ్డితో రాజీనామా చేయించిన చంద్రబాబు... జమ్మలమడుగు అసెంబ్లీ స్థానంలో పోటీ పెట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి ఆదినారాయణరెడ్డిని కడప ఎంపీగా బరిలోకి దింపారు. రామసుబ్బారెడ్డి స్థానంలో ఆదినారాయణ రెడ్డి కుటుంబసభ్యులకు ఎమ్మెల్సీ స్థానాన్ని ఇచ్చేశారు.
కలిసి ప్రచారం
ఎన్నికలకు ముందు చేతులు కలిపిన రాజకీయ ప్రత్యర్థులు.. నేడు కలసికట్టుగా ప్రచారం చేస్తున్నారు. ఆది విజయం కోసం రామసుబ్బారెడ్డి ... సుబ్బారెడ్డి కోసం ఆది.. ఒకరికి ఒకరు అన్నట్లుగా పనిచేస్తున్నారు. రెండు కుటుంబాలమహిళలూ..నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
జమ్మలమడుగు నియోజకవర్గంలో ఇద్దరు బలమైన నేతలు తెదేపాలో ఉండటం ఆ పార్టీకి కలిసొచ్చే అంశంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నియోజకవర్గంలో తెదేపా ప్రభుత్వం భారీ స్థాయిలో చేపట్టిన అభివృద్ధి పనులతోపాటు... కంబాలదిన్నె వేదికగా ఉక్కు పరిశ్రమ ఏర్పాటు వంటి అంశాలు తమకు లాభిస్తుయాని ధీమాను వ్యక్తం చేస్తోంది పసుపు దళం. వైరం వీడిన ఆది, రామ... ఇద్దరూ పార్టీని గెలిపిస్తారన్న దృఢ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తోంది.