పాత గుంటూరు ఠాణాపై దాడి కేసులో ముస్లిం యువకులపై నమోదైన ఆరు ఎఫ్‌ఐఆర్‌లలో ప్రాసిక్యూషన్‌ను ఉపసంహరించేందుకు రాష్ట్ర హోంశాఖ ఈ ఏడాది ఆగస్టు 12న జారీ చేసిన జీవో 776ను హైకోర్టు సస్పెండ్ చేయటం రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు అని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పటికే పలుమార్లు కోర్టుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అక్షింతలు పడ్డాయన్న ఆయన... నైతిక విలువలు , సీమ పౌరుషం ఉంటే ముఖ్యమంత్రి పదవికి జగన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కడప జిల్లా వేంపల్లిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
జీవో నెంబర్ 776పై విచారణ సందర్భంగా... ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు వ్యవస్థ గాడి తప్పుతోంది అని, చేతకాకపోతే డీజీపీ రాజీనామా చేయాలని హైకోర్టు మండిపడింది. ఇలా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతుందని ఇకనైనా సరిగ్గా వ్యవహరించాలని న్యాయస్థానం సూచించింది. గతంలో కోర్టులు ప్రతికూల వ్యాఖ్యలు చేసినందుకు అప్పటి ముఖ్యమంత్రులు నీలం సంజీవరెడ్డి, నేదురుమల్లి జనార్థన్ రెడ్డి తమ పదవులకు రాజీనామా చేశారు. కాబట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైతం రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను- తులసిరెడ్డి, ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు