IT Searches Continued at Shirdisai Electricals Company: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సన్నిహితుడు, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ అధినేత విశ్వేశ్వరరెడ్డి కంపెనీలో ఆదాయ పన్ను శాఖ అధికారులు 2వ రోజు కూడా దాడులు చేపట్టారు. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి వచ్చిన ఐటీ అధికారులు కేంద్ర (సీఆర్‌పీఎఫ్) బలగాల రక్షణలో ఆరోజు రాత్రి వరకు తనిఖీలు చేశారు. తిరిగి మంగళవారం ఉదయం కూడా సోదాలు కొనసాగించారు. ప్రధానంగా కడప నగరంలోని ద్వారకానగర్‌లో విశ్వేశ్వరరెడ్డి బంధువుల ఇళ్లలో, ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సోదాలు నిర్వహించి, పలు రికార్డులను అధికారులను స్వాధీనం చేసుకున్నారు.
2 Day IT Raids at Shirdi Sai Company: సీఎం జగన్‌కు సన్నిహిత కంపెనీగా పేరుపడిన షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌లో వరుసగా 2 రోజుల పాటు ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. కడప శివారులోని పారిశ్రామికవాడలో ఏకకాలంలో 3 చోట్ల సోదాలు నిర్వహించారు. పలు రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ప్రభుత్వ ప్రోత్సాహంతో అనతి కాలంలోనే షిర్టీసాయి సంస్థ ఆర్థికంగా ఎదిగింది. ఈ నేపథ్యంలో ఆదాయ పన్ను శాఖ రెండు రోజులుగా తనిఖీలు చేపట్టడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
దేవినేని అవినాష్ ఇంట్లో ఐటీ సోదాలు.. వైసీపీలో కలకలం
IT Searches Among CRPF Forces: వైసీపీ హయాంలో భారీగా లబ్ధి పొందినట్లు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న షిర్టీసాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ ప్రధాన కార్యాలయం, కర్మాగారంలో ఆదాయ పన్ను శాఖ అధికారులు వరుసగా రెండు రోజుల పాటు తనిఖీలు నిర్వహించారు. తెలంగాణ నుంచి రెండు బస్సులు, ఇన్నోవా వాహనాల్లో వచ్చిన 50 మంది అధికారులు బృందాలుగా విడిపోయి, కడపలో సోదాలు నిర్వహించారు. షిర్టీసాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ కార్యాలయంలో సీఆర్‌పీఎఫ్ బలగాల బందోబస్తు మధ్య ఐటీ అధికారులు దాడులు చేశారు. పలు రికార్డులను పరిశీలించారు. ఇదే సమయంలో కడప ద్వారకానగర్‌లో కంపెనీ యజమాని విశ్వేశ్వర్‌రెడ్డి సోదరుడైన చిన్న పిల్లల వైద్యుడు కరుణాకర్ రెడ్డి ఆసుపత్రి, ఇంట్లోనూ సోదాలు జరిపారు. కడప కో-ఆపరేటివ్ కాలనీలోని కీర్తి రెసిడెన్సీలోని బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు చేశారు.
Shirdisai Electricals Company Works: కడపలోని కర్మాగారంలో విద్యుత్తు స్మార్ట్ మీటర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర ఉపకరణాలు తయారు చేస్తున్నారు. వీటికి అవసరమైన ముడిసరుకు అమ్మకాలు, కొనుగోలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పన్నులు సక్రమంగా చెల్లించలేదనే ఆరోపణలతో ఐటీ శాఖ దాడులు చేసినట్లు తెలుస్తోంది. నగరంలోని రిమ్స్ సమీపంలోని కోట్ల రూపాయల విలువైన 52 ఎకరాల ప్రభుత్వ భూమిని జగన్ ప్రభుత్వం ఇటీవలే ఈ కంపెనీకి కట్టబెట్టింది. వేల కోట్ల రూపాయల విలువైన అనేక భారీ ప్రాజెక్టులతో పాటు, వ్యవసాయ విద్యుత్తు సర్వీసులకు స్మార్ట్ మీటర్లు సమకూర్చే పనులనూ అప్పగించింది. ఈ నేపథ్యంలోనే ఐటీశాఖ అధికారులు కంపెనీకి సంబంధించిన అన్ని ఆర్థిక లావాదేవీలను పరిశీలించారు. పలు కీలక రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
సీఎం జగన్ సన్నిహిత కంపెనీ షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌పై ఐటీ రైడ్స్ - రెండో రోజు కొనసాగుతున్న సోదాలు
Shirdi Sai Company Staff Blocked Media: వరసగా రెండు రోజుల పాటు షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీలో ఐటీ శాఖ దాడులు కొనసాగిస్తున్న క్రమంలో కంపెనీ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. పారిశ్రామికవాడలో ఉన్న కంపెనీ పరిసర ప్రాంతాల్లోకి ఎవరినీ అనుమతించకుండా ఆంక్షలు విధించారు. ప్రధాన కార్యాలయం వద్ద కేంద్ర పోలీసు బలగాలు ఉన్నప్పటికీ, అటువైపు ఎవరు సంచరించినా, నిల్చున్నా బెదిరింపులకు పాల్పడ్డారు. మీడియానూ వెనక్కి పంపించారు. ఎవరూ ఫొటోలు, వీడియోలు తీయకుండా అడ్డుకున్నారు. కడపలోని మూడు ప్రాంతాల్లో రెండో రోజు రాత్రి వరకు ఐటీ సోదాలు కొనసాగాయి. ఇవాళ కూడా కొనసాగించే వీలుందని సమాచారం.