అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో దేశంలోనే గొప్పగా యోగి వేమన విశ్వవిద్యాలయం (యోవేవి) నిలుస్తుందని ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా ఆశాభావం వ్యక్తం చేశారు. ఏక్యూసీ మిడిల్ ఈస్ట్ సంస్థ అందించిన ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ధ్రువపత్రాలను విశ్వవిద్యాలయానికి ప్రదానం చేసే కార్యక్రమం యోవేవిలో మంగళవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఉపముఖ్యమంత్రి హాజరయ్యారు. ఉపకులపతి మునగాల సూర్యకళావతికి ధ్రువపత్రాలు అందజేశారు.
విశ్వవిద్యాలయానికి రావాల్సిన రూ.40 కోట్లు, ప్రొద్దుటూరు ఇంజినీరింగ్ కళాశాలకు మంజూరైన రూ.68 కోట్ల విడుదలకు త్వరలోనే జీవో వస్తుందని అంజాద్‌బాషా చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా విద్యార్థులు తయారు కావాలని ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి ఆకాంక్షించారు. విశ్వవిద్యాలయం సమగ్ర అభివృద్ధికి రూ.126 కోట్ల బడ్జెట్ విడుదల కానుందని తెలిపారు. ప్రతిష్ఠాత్మక సంస్థల నుంచి ధ్రువపత్రాలు పొందడంపై యోవేవి అధికారులు, అధ్యాపకులను అభినందించారు.
బోధన, పరిశోధన, సామాజిక సేవా కార్యక్రమాలతో త్రివేణి సంగమంలా సాగుతూ విలక్షణ ఫలితాలను యోవేవి సొంతం చేసుకుంటోందని ఉపకులపతి సూర్యకళావతి అన్నారు. విద్యార్థుల ప్రయోజనమే లక్ష్యంగా శ్రమిస్తున్న విశ్వవిద్యాలయానికి ఏక్యూసీ మిడిల్ ఈస్ట్ సంస్థ ద్వారా ధ్రువపత్రాలు అందజేయడం ఆనందంగా ఉందన్నారు.