కడప జిల్లాలో కొందరు అక్రమార్కులు చెరువులను దోచుకుంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా చెరువుల్లోని మట్టిని ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారు. జేసీబీలతో ప్రకృతి సంపదను నాశనం చేస్తున్నారు. రాజంపేట మండలం మన్నూరు, పోలి చెరువుల్లో ఈ పరిస్థితి నెలకొంది.
రాజపేట మండలం రామాపురం చెక్పోస్ట్ వద్ద, పోలి, ఊటుకూరు ప్రాంతాల్లో స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న వ్యాపారులు... ఫ్లాట్లు వేయడానికి భూమిని చదును చేస్తున్నారు. దీనికోసం మన్నూరు, పోలి చెరువులు నుంచి జేసీబీలు, టిప్పర్లు పెట్టి మట్టిని తరలిస్తున్నారు. వాస్తవానికి చెరువుల నుంచి మట్టిని తీసుకు వెళ్లాలంటే నీటి పారుదల శాఖ అధికారుల నుంచి అనుమతి పొందాలి. కానీ ఎలాంటి అనుమతి లేకుండానే రియల్ ఎస్టేట్ వ్యాపారులు పట్టపగలే చెరువులను సర్వనాశనం చేస్తున్నారు. ఇదంతా జరుగుతున్నా చెరువు ఆయకట్టు రైతులు గానీ, చెరువు సంఘం నాయకులు గానీ పట్టించుకోలేదు. సంబంధిత శాఖ అధికారులు కూడా ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
అక్రమార్కులు చెరువులనే కాకుండా కొండలు గుట్టలని సైతం తవ్వి మట్టిని తీసుకెళుతున్నారు. దీనివల్ల ఆ ప్రాంతం చదునుగా మారుతోంది. అలా చదునుగా మారిన ప్రాంతాన్ని కొందరు ఆక్రమించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. కొండలను సర్వ నాశనం చేస్తున్న కనీసం అటవీశాఖ అధికారులు స్పందించకపోవడం గమనార్హం.
చెరువులు, కొండలు, గుట్టల నుంచి మట్టిని తరలించడం చట్టవిరుద్ధమని అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని ఆర్డిఓ రామచంద్రారెడ్డి తెలిపారు.
ఇదీచూడండి:క్రికెట్లో వాగ్వాదం... బాలుడు మృతి