hc on viveka murder case : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మొదటి నిందితుడు ఎర్ర గంగిరెడ్డి సాక్షులను బెదిరించినట్లు , బెయిలు షరతులను ఉల్లంఘించినట్లు ఏమైనా ఆధారాలుంటే .. ఆ వివరాలను కోర్టు ముందు ఉంచాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేశ్ తాజాగా ఈమేరకు ఆదేశాలిచ్చారు.
గంగిరెడ్డి సాక్షుల్ని బెదిరిస్తున్నారని సీబీఐ తరఫున్యాయవాది చెన్నకేశవులు వాదించారు. దర్యాప్తును అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని వివరించారు. అప్పటి సీఐ శంకరయ్య ఇటీవల మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చేందుకు సిద్ధపడి... తర్వాత విరమించుకున్నారని చెప్పారు. హత్యకేసును దర్యాప్తు చేస్తున్న... సీబీఐ అదనపు ఎస్పీపై కడప రిమ్స్ ఠాణా పోలీసులు ఇటీవల కేసు నమోదు చేశారన్నారు. హైకోర్టు ఆ కేసులో తదుపరి చర్యలన్నింటిని నిలుపుదల చేసిందని గుర్తుచేశారు. ఆ వాదనలపై న్యాయమూర్తి స్పందిస్తూ.... గంగిరెడ్డి బెయిలు షరతులను ఉల్లంఘించినట్లు ఆధారాలుంటే వాటిని కోర్టు ముందు ఉంచాలని ఆదేశించారు. విచారణను వాయిదా వేశారు. పులివెందుల కోర్టు జూన్ 2019లో గంగిరెడ్డికి మంజూరు చేసిన బెయిలును రద్దు చేయాలని కోరుతూ సీబీఐ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి : viveka murder case : 'ఆ రాత్రి వివేకా ఇంటికి వెళ్తున్నట్లు సునీల్ చెప్పాడు'