అల్పపీడన ప్రభావంతో కడప జిల్లావ్యాప్తంగా వర్షాలు(kadapa district rains) కురుస్తున్నాయి. వర్షాల వల్ల కడప నగరమంతా జలమయమైంది. రోడ్లపై మోకాలి లోతు వరకు వరద నీరు నిలిచిపోవటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలు కాలనీల్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. బుగ్గవంక ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరగటంతో 2వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఎస్ఆర్ నగర్‌లో నడుము లోతు వరకు నీరు నిల్వ ఉండటంతో అత్యవసరాల కోసం కొందరు ఏకంగా బోట్లను ఆశ్రయిస్తున్నారు. నీటి క్యాన్లతో బోటును తయారు చేసుకుని వినియోగిస్తున్నారు. ఊటుకూరు చెరువు అలుగు పారడంతో.. విజయనగర్ కాలనీలోకి వరద నీరు పోటెత్తుతోంది. ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో వాటిని ఎత్తి పోసేందుకు ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు.
నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు, భరత్ నగర్, అంబేడ్కర్ కూడలి, భాగ్య నగర్ కాలనీ, గంజికుంట కాలనీ, మృత్యుంజయ కుంట, ప్రకాష్ నగర్, నకాష్ వీధి, శాస్త్రి నగర్, ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయం రోడ్డు, కోర్టు రోడ్డు, నీటమునిగాయి. పలు వాగులు, వంకలు, చెరువులు ఉద్దృతంగా ప్రవహిస్తున్నాయి.
సిద్ధవటం మండలంలోని ఎస్సీ కాలనీ చుట్టూ వరద నీరు చుట్టుముట్టింది. కడప శివారులోని పాలెం పల్లె వద్ద వాగులో ఎద్దుల బండి కొట్టుకొని పోవడంతో రైతు ప్రాణాలతో బయటపడ్డాడు. జిల్లా మొత్తం భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు, నదుల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.
పాఠశాలలకు సెలవు..
బుగ్గవంక ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో సమీప ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వాగులు, వంకలు, నదుల వద్ద భద్రతా చర్యలు చేపట్టారు. భారీ వర్షాల కారణంగా నేడు, రేపు జిల్లాలోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలో జరిగే పరీక్షలను వాయిదా వేశారు.
ఇళ్లలోకి నీరు..
సోమశిల జలాశయం వెనుక జలాలు, వర్షపు నీరు కలిసి గ్రామాలను ముంచెత్తుతున్నాయి. బద్వేల్ నియోజకవర్గంలోని అట్లూరు మండలంలో చెరువులు అలుగులు పారుతున్నాయి. ముత్తుకూరు గ్రామ పంచాయతీలోని అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రహదారిపై నీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు కాలనీల్లో ఇళ్లలోకి వర్షం నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
రాయచోటి నియోజకవర్గంలో...
ఏకధాటి వర్షాలకు రాయచోటి నియోజకవర్గంలోని చెరువులు, కుంటలు నిండి అలుగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. రాయచోటి మండలంలో మాండవ్య నది తీవ్ర రూపం దాల్చింది. చిన్నమండెం మండలంలోని జిల్లావాండ్ల పల్లి వద్ద రోడ్డు తెగిపోయింది. మల్లూరు వద్ద మాండవ్య నది ఉద్ధృతంగా ప్రవహించడంతో రాకపోకలను అధికారులు నిలిపివేశారు. లక్కిరెడ్డిపల్లి- ఈడిగపల్లి మధ్య రోడ్డు తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
రాయచోటి పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరింది. వెలిగల్లు పింఛ ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. ఎగువ నుంచి నీటి ప్రవాహం కొనసాగుతుండంతో గేట్ల ద్వారా దిగువన పాపాగ్ని బాహుదా నదులకు నీటిని విడుదల చేశారు. పంట పొలాలకు భారీ నష్టం వాటిల్లింది. అధికార యంత్రాంగం వరద నష్టనివారణ చర్యలు చేపట్టింది. సుండుపల్లి మండలంలో పింఛా ప్రాజెక్టు కట్టకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు లక్ష క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు 5 గేట్ల ద్వారా 48 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు కట్ట తెగే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. దీంతో దిగువన అన్నమయ్య ప్రాజెక్టు భద్రతపై అధికారులు అప్రమత్తమయ్యారు.
ఇవీ చదవండి:
- చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు..తిరుమలలో విరిగిపడ్డ కొండచరియలు
- గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను పరామర్శించిన సీఎం జగన్
- 'మా ఓపికకు ఓ హద్దుంటుంది... వడ్లు కొంటరా.. కొనరా..? '
- రూ. 6500లతో ఎలక్ట్రిక్ సైకిల్.. స్పీడ్ ఎంతో తెలుసా..!