దూరం నుంచి చూస్తే.. ఆ రోడ్డుపై అయిదో గేరును తగ్గించకుండా దూసుకెళ్లొచ్చు అనిపిస్తుంది.కానీ ఆ దారిలో ప్రయాణం చేస్తే తెలుస్తుంది.. అసలు సంగతి...అయిదో గేరు సంగతి దేవుడెరుగు...బండి ఒకటో గేరులో ఉన్నా ఒళ్లు హూనం కాకుండా ఇల్లు చేరలేమని అర్థమైపోతుంది. రోడ్డు కొద్ది దూరం వరకూ తారుతో చక్కగా కనిపిస్తుంది..హాయిగా ఉందనుకునే లోపే అకస్మాత్తుగా లోతైన గుంతలు వస్తాయి. అప్పుడు వేగంగా ఉన్న బండిని వాటిలోకి దించడమే తప్ప మరో మార్గం కనిపించదు. ఆ షాక్ నుంచి తేరుకునే లోపే మరో గొయ్యి వస్తుంది. రోడ్డు ఇలా ఉందంటే..ఇదేదో మారుమూల పల్లెకు వెళ్లే మార్గం కాదు. కడప జిల్లా (Kadapa District)మీదుగా వెళ్లే గుత్తి-ఆంకోలా జాతీయ రహదారి (ఎన్‌హెచ్-67) ( National Highway-67). ఈ మార్గం పరిస్థితి కడప విమానాశ్రయం ( Kadapa Airport)నుంచి తాళ్ల ప్రొద్దుటూరు వరకు ఇలాగే గుంతలతో దారుణంగా ఉంది. ఈ దారిలో కేవలం 40 కిలోమీటర్ల పరిధిలో 200 గుంతలు ఉన్నాయి. ముఖ్యంగా చిత్రావతి, పాపఘ్ని వంతెనలపై రోడ్డు వేసిన ఛాయలే లేవు. వంతెన శ్లాబుకు వాడిన ఇనుప కడ్డీలు తేలాయి. ఇలాంటి రోడ్డు గుండా ప్రయాణమంటే ఎలా ఉంటుందో ఇట్టే అర్థమవుతుంది. ఇప్పటికైనా రహదారికి సరైన శాశ్వత మరమ్మత్తులు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఇదీ చదవండి :badvel election:ఓటింగ్ శాతం, మెజారిటీ పెరగాలి: సీఎం