కడప జిల్లా రాయచోటి కొవిడ్ ఆసుపత్రిని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తనిఖీ చేశారు. అక్కడ చికిత్స పొందుతున్న కరోనా బాధితులను పరామర్శించారు. వారికి అందిస్తున్న వైద్య సేవలు, ఇతర వసతి సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. వైరస్ వల్ల భయాందోళన చెందవద్దని… ధైర్యంగా ఉంటూ చికిత్సలు తీసుకుంటే త్వరగా నయం అవుతుందని రోగుల్లో మనోధైర్యాన్ని నింపారు. ఆసుపత్రిలో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తనకు ఫోన్ చేయొచ్చని చెప్పారు. నోడల్ ఆఫీసర్, హెల్ప్ డెస్క్ తదితర విషయాలపై ఆయన ఆరా తీశారు. వైద్యం, భోజనం, పారిశుద్ధ్యం వంటి సేవల్లో ఎక్కడా రాజీపడొద్దని ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డా. ప్రవీణ్ కుమార్ రాజుకు తెలిపారు.
ఆరోగ్యశ్రీ పథకం కింద పూర్తిగా ఉచిత వైద్యం అందించాలని, ప్రైవేట్‌గా చేరిన రోగులకు కూడా ప్రభుత్వం నిర్ణయించిన ధరలే వసూలు చేయాలన్నారు. ఆక్సిజన్ సరఫరా కోసం ఎటువంటి అవసరం కావాలన్నా తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. వైద్యులకు, సిబ్బందికి మూడు పూటలా భోజన వసతి కల్పించాలని ఆసుపత్రి యాజమాన్యం చీఫ్ విప్‌ను కోరగా తన సొంత నిధులుతో ఏర్పాటు చేయిస్తామన్నారు. ఆసుపత్రి ఎదుట షామియానాలు, తాగునీటి వసతి సౌకర్యాలు కల్పించిన శ్రీకాంత్ రెడ్డికి యాజమాన్యం, రోగులు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా, అర్బన్ సీఐ రాజు ఉన్నారు.
ఇదీ చదవండి:
సొంత పార్టీ ఎంపీలే.. సీఎం జగన్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు: నారా లోకేష్