Arogyasree Fraud : ఆరోగ్యశ్రీ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఘరానా మోసగాడిని కడప జిల్లా రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం..శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆర్ఎంపీ వైద్యుడు వెలమల నారాయణరావు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌నంటూ మోసాలకు పాల్పడుతున్నాడు. రాయచోటి పట్టణంలోని అమరావతి ఆసుపత్రి యాజమన్యానికి తన పేరును అశోక్ రెడ్డిగా పరిచయం చేసుకున్న నిందితుడు.. ఆరోగ్యశ్రీ బిల్లులు త్వరగా రావాలంటే కొంత డబ్బు చెల్లించాలని డిమాండ్ చేశాడు. ఇది నమ్మిన ఆసుపత్రి యాజమాన్యం అతడికి రూ.1.50 లక్షలు ముట్టజెప్పింది.
కొన్ని రోజుల తర్వాత ఆసుపత్రి యాజమాన్యం మంగళగిరిలోని ఆరోగ్య శ్రీ ట్రస్ట్ కేంద్రంలో ఆరా తీయగా.. అశోక్ రెడ్డి పేరుతో ఇక్కడ ఎవరూ పని చేయటం లేదని తెలిపారు. దీంతో మోసపోయామని తెలుసుకున్న ఆసుపత్రి యాజమాన్యం రాయచోటి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు శ్రీకాకుళం జిల్లా జులుమూడు పెద్దదోగు గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు వెలమల నారాయణ రావుగా గుర్తించి అరెస్టు చేశారు. నిందితుడికి నేర చరిత్ర ఉందని..,గతంలోనూ పలు జిల్లాల్లో కేసులు నమోదైనట్లు డీఎస్పీ వెల్లడించారు.
ఇదీ చదవండి
Accident At Rayadurgam Flyover: ఫ్లైఓవర్‌పై ప్రమాదం.. సాప్ట్వేర్ ఉద్యోగి అనుమానాస్పద మృతి