కడప జిల్లాలో అన్నదాతల బలిదానాలు కొనసాగుతూనే ఉన్నాయి. సాధారణంగా సరైన వర్షాలు కురవక రైతులు ఆందోళన చెందుతుండేవారు. అయితే గత రెండేళ్లుగా వరుణ దేవుడు అనుకూలించినా వారికి సమస్యలు తప్పట్లేదు. జిల్లాలో ఈ ఒక్క నెలలోనే ఇప్పటివరకు 8 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వేరుశనగ, పత్తి, వరి, జొన్న, సజ్జ పంటలను ప్రధానంగా సాగు చేస్తారు. అరటి, బొప్పాయి, చీనీ లాంటి ఉద్యానపంటలను అధికంగానే పండిస్తారు. ఈ ఏడాది మార్చి నుంచి కరోనా వ్యాప్తి కారణంగా పంటల అమ్మకాలపై తీవ్ర ప్రభావం పడింది. ఫలితంగా సాగు పెట్టుబడికి ఖర్చు పెట్టిన డబ్బులూ వెనక్కి రాకపోవటంతో కొందరు అన్నదాతలు నష్టాల పాలయ్యారు.
ఈ క్రమంలో గతంలో తీసుకున్న అప్పులు తీర్చలేక పలువురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. గతేడాది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం బలవన్మరణం చెందిన రైతుల కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని రూ.7 లక్షలకు పెంచింది. రైతుల ఆత్మహత్యల నివారణకు కొన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు సూచించింది. ఇందులో భాగంగా జిల్లాస్థాయిలో రైతుల సమస్యలను తెలుసుకునేందుకు ప్రత్యేక స్పందన కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించింది. అయితే వీటిని క్షేత్రస్థాయిలో అమలుచేయకపోవటంతో రైతుల ఆత్మహత్యలకు ఏమాత్రం అడ్డుకట్ట పడట్లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
పొట్ట దశలో పాడై... రుణాలకు బలై
కలసపాడు మండలం శంకవరం గ్రామానికి చెందిన రైతు పాతకుంట సుబ్బారెడ్డి (55) ఈ నెల 27వ తేదీన తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈయన గతేడాది రైతు భరోసా సొమ్ములు పొందినా. రూ.7 లక్షలకుపైగా అప్పులు తీర్చలేకపోయారు. ఈయనకు భార్య నాగమ్మ, కుమారుడు హజరత్‌రెడ్డి ఉన్నారు. కుమారుడికి ఎనిమిదేళ్ల కిందట వివాహం కాగా, చిరుద్యోగిగా జీవిస్తున్నారు. సుబ్బారెడ్డికి గతంలో అయిదెకరాల సొంత వ్యవసాయ భూమి ఉండేది. సుమారు అయిదేళ్ల కిందట బాగా నష్టాలు రావటంతో 30 సెంట్లు మినహా మిగతా భూమిని అమ్మేశారు. గత నాలుగేళ్లుగా 4 ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. ఈ ఏడాది రూ.లక్ష పెట్టుబడితో వరి సాగు చేశారు. వెన్ను పొట్ట దశలో ఉండగా పంటకు తెగులు సోకడంతో నష్టం వాటిల్లింది.
పంటల ముంపుతో మృత్యుఒడికి
నందలూరు మండలం నల్లతిమ్మాయపల్లెకు చెందిన రైతు ఉమ్మడి గంగిరెడ్డి(48) పురుగుల మందు తాగి ఈ నెల 23వ తేదీన కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఒక కుమారుడిని ఉపాధి కోసం కువైట్‌కు పంపించగా, మరొకరు డిగ్రీ చదువుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కుమార్తెకు వివాహం చేశారు. 8 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి పంట సాగు చేశారు. ఇటీవల కురిసిన వర్షాలతో లేబాక చెరువు కింద సుమారు నాలుగెకరాల పంట ముంపు బారిన పడింది. మిగిలిన పొలంలో సాగు చేసిన పంటకూ పెట్టుబడి సొమ్ములు దక్కలేదు. ఈయన దాదాపు రూ.3 లక్షలు అప్పు చేశారు. రైతుభరోసా పథకానికి దరఖాస్తు చేసుకున్నా ప్రభుత్వం సొమ్ములు అందించలేదు.
వరుస నష్టాలతో రూ.40 లక్షల అప్పు
పెండ్లిమర్రి మండలం కోనాయపల్లె గ్రామానికి చెందిన సంగటి గంగిరెడ్డి (42) విషద్రావణం తాగడంతో ఈనెల 26వ తేదీన మృతిచెందారు. ఈయన గతేడాది రైతు భరోసా పథకం కింద ఆర్థిక సాయం పొందారు. ఈయనకు నాలుగున్నర ఎకరాల సొంత వ్యవసాయ భూమి ఉంది. ఈ ఏడాది కొర్రలతో పాటు జొన్న, మిరప పంటలు సాగు చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు కొర్ర పంట పూర్తిగా నష్టపోయారు. గతేడాది తెగుళ్ల కారణంగా పత్తి పంటను కోల్పోయారు. ఎనిమిదేళ్ల కిందట రెండు బోర్లు వేయడానికి అప్పు చేశారు. దీనికితోడుగా వరుస పంట నష్టాలతో మొత్తం అప్పులు రూ.40 లక్షలకు చేరినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. వాళ్లు కూడా వ్యవసాయాధారంగా జీవిస్తున్నారు.
కౌలు పొలం ఆదుకోక... గిట్టుబాటు ధరల్లేక
రాజంపేట మండలం కమ్మపల్లె గ్రామానికి నల్లపునేని నరేంద్రనాయుడు (45) ఈ నెల 6వ తేదీన తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. సుమారు 20 ఏళ్ల కిందట ఈయన భార్య కుమార్తెను తీసుకుని కువైట్‌కు వెళ్లిపోయారు. ఈయనకు 80 సెంట్ల సొంత పొలం ఉంది. ఈ ఏడాది అయిదెకరాలు కౌలుకు తీసుకుని అరటి పంట సాగు చేశారు. అయితే కరోనా కారణంగా గిట్టుబాటు ధరల్లేక పెట్టుబడి ఖర్చులు కూడా రాలేదు. ఫలితంగా వడ్డీల భారంతో అప్పు రూ.10 లక్షలకు పెరిగింది. ఈ నేపథ్యంలో కుమారుడితో గొడవపడి మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈయనకు రైతు భరోసా సొమ్మును ప్రభుత్వం విడుదల చేసినా బ్యాంకు సిబ్బంది రుణాల కింద జప్తు చేసుకున్నారు.
రైతులకు అవగాహన కల్పిస్తున్నాం
గతంలో వ్యవసాయ బోర్లు వేయడానికి అప్పులు చేసి రైతులు ఆత్మహత్యలు చేసుకునేవారు. అయితే గత కొంతకాలంగా కురుస్తున్న వర్షాలకు భూగర్భ జలాలు వృద్ధి చెందడంతో పాటు సాగునీటి లభ్యత పెరిగింది. అయితే ఇటీవల అప్పుల భారంతో కొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రస్తుతమున్న పరిస్థితులను బట్టి ఎలాంటి పంటలు సాగుచేస్తే లాభాలు సాధించవచ్చనే విషయమై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. కరోనా నేపథ్యంలో ప్రత్యేక స్పందన కార్యక్రమం నిర్వహించలేకపోతున్నాం. త్వరలోనే దాన్ని అమలు చేసేందుకు కృషిచేస్తాం. ప్రభుత్వ ఆర్థిక సాయానికి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం. - మురళీకృష్ణ, జేడీ, వ్యవసాయశాఖ
ఇవీ చదవండి..