AP High Court: కడప జిల్లా సీకే దిన్నె మండలం పూర్వ తహశీల్దార్ బి. మహేశ్వరరెడ్డికి కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు ఆరునెలల జైలు శిక్షతో పాటు 200 రూపాయల జరిమానా విధించింది. అప్పీల్ వేసుకునేందుకు వీలు కల్పిస్తూ తీర్పు అమలును రెండు వారాలు నిలువుదల చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తి ఈ మేరకు తీర్పు ఇచ్చారు. సీకే దిన్నె మండల పరిధిలోని చెర్లోపల్లి గ్రామంలో చుక్కల భూమిగా వర్గీకరించిన తమ భూమిని పట్టా భూములుగా రెవెన్యూ రికార్డుల్లో చేర్చాలని కోరుతూ కె.శేఖర్, సోమిశెట్టి హరిగోపాల్ జిల్లా స్థాయి కమిటీని ఆశ్రయించారు.
ఆ కమిటీ సైతం ఆ భూమిని చుక్కల భూమి నుంచి తొలగించాలని పేర్కొంది. ఆ ఆదేశాలను అమలు చేయకపోవడంలో వారు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు జిల్లా స్థాయి కమిటీ చైర్మన్ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని, పిటిషనర్ల భూమిని చుక్కల భూమి నుంచి తొలగించాలని గతేడాది జూన్ లో ఉత్తర్వులిచ్చింది. ఆ ఆదేశాలను తహశీల్దార్ అమలు చేయకపోవడంతో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు. తహశీల్దార్ ఉద్దేశపూర్వకంగా ప్రతిదశలో కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని, నిర్లక్ష్యం ప్రదర్శించారని పేర్కొంటూ ఆరు నెలల జైలుశిక్ష విధించారు.
ఇదీ చదవండి: రూ.వేల కోట్ల నిధులు.. ఎటు వెళ్లాయో తెలియడం లేదు: పయ్యావుల