కడప జిల్లా ప్రొద్దుటూరులో మాజీ ఎమ్యెల్యే నంద్యాల వరదరాజులురెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. గ్రామీణ సీఐ విశ్వనాథ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కామనూరు పంచాయతీ పరిధిలోని 6వ వార్డుకు వైకాపా మద్దతుతో నంద్యాల సరోజ కుమార్తె వర్షిత పోటీ చేస్తున్నారు. ఆదివారం మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి, సోదరుడు రాఘవరెడ్డి, భార్గవ్‌రెడ్డి, హనుమంతురెడ్డి ఇంకా కొంతమంది కామనూరులోని ఆమె ఇంటి వద్దకు వెళ్లారు. గతంలో ఎప్పుడూ ఎన్నికలు లేవని నువ్వు పోటీ చేస్తావా అంటూ దౌర్జన్యం చేశారు. ఈ సందర్భంలో సరోజ వీడియో తీస్తుండగా చరవాణి లాక్కుని పగులగొట్టారు. దీంతో సరోజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వరదరాజులరెడ్డి, ఆయన సోదరుడు రాఘవరెడ్డితో పాటు మొత్తం 14 మందిని అరెస్టు చేశామని సీఐ వివరించారు. ఈ నేపథ్యంలో పురపాలిక మాజీ ఛైర్మన్ ఆసం రఘురామిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, తదితరులు ఠాణా ఎదుట భైఠాయించి ఆందోళన చేశారు.
డబ్బులు పంపిణీ చేస్తున్నారని వెళ్తే..!
కామనూరులో వైకాపా అభ్యర్థి డబ్బులు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం రావడంతో అక్కడి వెళ్లాం. డబ్బులు పంచడం మంచి పద్దతి కాదని, గ్రామంలో ఎన్నడూ లేదని.. పంచొద్దని చెప్పడానికి వెళ్లామని వరదరాజులురెడ్డి కుమారుడు కొండారెడ్డి చెప్పారు. దీంతో తమపై అక్రమ కేసులు బనాయించారని ఆయన పేర్కొన్నారు.
కేంద్ర కారాగారానికి తరలింపు..
ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డిని రిమాండు నిమిత్తం కడప కేంద్రకారాగారానికి తరలించారు. పంచాయతీ ఎన్నికల్లో వరదరాజులురెడ్డి, అతని అనుచరులు దౌర్జన్యానికి దిగినట్లు బాధితురాలిచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వారిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండుకు ఆదేశించారు.
ఇదీ చదవండి: 170 కాదు.. 203 మంది గల్లంతు:సీఎం రావత్