కడప జిల్లా తుమ్మలపల్లెలో కొలువుదీరిన యురేనియం కర్మాగారం చుట్టుపక్కల గ్రామాల్లో చీకట్లు నింపుతోంది. వ్యర్థాల నిర్వహణలో కర్మాగార నిర్లక్ష్యం కారణంగా వెలువడుతున్న కాలుష్యం.. ఆ ప్రాంతంలోని భూసారాన్ని హరించి వేస్తోంది. స్వచ్ఛమైన నీరు ఉన్న భూగర్భాన్ని అత్యంత ప్రమాదకర కాలుష్యం క్రమంగా ఆక్రమిస్తోంది. ఒకప్పుడు దాహం తీర్చిన జలం ఇప్పుడు విష సమానంగా మారిపోయింది. బోర్లపై ఆధారపడి కొన్నేళ్ల వరకూ చక్కటి అరటి పంటలు సాగు చేసిన రైతులు ఇప్పుడు పొలాలను బీళ్లుగా వదిలేయాల్సిన దుస్థితి.
ఆ బోరుతో మొదలై
మబ్బుచింతలపల్లి గ్రామానికి చెందిన మహేశ్వరరెడ్డి అనే యువ రైతుకు తనకున్న మూడెకరాల భూమి ఆధారం. ఈ భూమికి చేరువలోనే కొండ వెనక యురేనియం కర్మాగారం వ్యర్థాలను నిలువ చేసే చెరువు ఉంది. కాలుష్యాలు భూగర్భంలోకి ఇంకిపోవడం వల్ల ఈ ప్రాంతంలో మొదట నాశనమైంది ఈ బోరే. ఒకప్పుడు ఊరంతటికీ తీయని నీరు అందించిన ఈ బోరు జలం ఇప్పుడు విషమైపోయింది. ఈ నీటితో అరటి తోట వేస్తే మొక్కలు బతికినా తర్వాత ఎండిపోయాయి. అనంతరం మరో మూడు బోర్లు వేసినా అదే పరిస్థితి. అలా అప్పులపాలైన మహేశ్వరరెడ్డి ప్రస్తుతం తన భూమిని బీడుపెట్టి కూలీనాలి చేసుకుంటున్నాడు. ఇతనే కాదు ఈ ప్రాంతంలో ఎంతో మంది రైతులు యురేనియం కర్మాగారం కారణంగా అప్పులపాలై కష్టాలు ఎదుర్కొంటున్నారు. అధికారుల నుంచి రాజకీయ నాయకుల వరకు తన గోడు వెళ్లబోసుకున్నా పరిస్థితుల్లో మార్పు రాలేదు.
ఒక్క పంటలే కాకుండా భూగర్భంలో ప్రమాదకర కాలుష్యం విస్తరిస్తున్నందున ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యంపై ఎలాంటి హాని కలిగిస్తుందో తలచుకుంటేనే ఆందోళన కలుగుతోంది. ఈ దిశగా ఇప్పటి వరకూ అధికారులు ఎలాంటి అధ్యయనం నిర్వహించలేదు.